
- హాజీపూర్ ఘటనలోనూ ‘గంజాయి’ పాత్ర
- మత్తుకు అలవాటుపడ్డ శ్రీనివాస్ రెడ్డి
- రాష్ట్రమంతటా గంజాయి అమ్మకాలు
- యువత, విద్యార్థులే లక్ష్యంగా వ్యాపారం
- శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
హైదరాబాద్, వెలుగు :రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న హాజీపూర్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా అంశం మరోమారు తెరపైకొచ్చింది. గంజాయి మత్తులోనే శ్రీనివాస్‌రెడ్డి బాలికలపై అత్యాచారం చేసి చంపినట్టు స్థానికులు చెబుతున్నారు. అతడిపాటు మరికొందరు గంజాయి లేనిదే ఉండలేని పరిస్థితికి చేరుకున్నారని, ఆ మత్తులోనే గొడవలకు దిగుతున్నారని అంటున్నారు. బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, సాయంత్రమైతే యూత్, స్టూడెంట్స్ గంజాయి మత్తులో జోగుతున్నారని, గాంజా పిల్లల జీవితాలను నాశనం చేస్తోందని వాపోతున్నారు.
రాష్ట్రంలో అమ్మకాల జోరు
హైదరాబాద్, వరంగల్ సిటీలకు పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి పెద్దమొత్తంలో సరఫరా అవుతుంటే.. జిల్లా, మండల కేంద్రాలకు స్థానికంగానే అక్కడక్కడ పండించిన గంజాయి సరఫరా అవుతోంది. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా మళ్లీ సాగు చేస్తూనే ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తరలిస్తున్న వ్యాపారులు పటిష్టమైన నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త పద్ధతుల్లో వ్యూహాలు మార్చి అనుకున్న ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నారు. ముఖ్యంగా రైలు మార్గాలను ఉపయోగించుకుంటున్నట్టు పట్టుబడుతున్న గంజాయి కేసులను బట్టి తెలుస్తోంది.
గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ మార్చి వరకు రాష్ట్రంలో 183 గంజాయి కేసులు నమోదవగా 336 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 2,835 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గంజాయి మొక్కలనూ సరఫరా చేస్తున్నారు. ఇందుకు సంబంధించి 50 కేసులు నమోదయ్యాయి. 61మందిని అరెస్టు చేశారు.
యూత్, స్టూడెంట్స్ టార్గెట్
గంజాయి వ్యాపారులు యూత్, స్టూడెంట్స్‌ను టార్గెట్ చేసుకున్నారు. ముందు తక్కువ ధరకు అలవాటుచేసి బానిసలయ్యాక అధిక ధరకు అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఇంజినీరింగ్ కాలేజీలే లక్ష్యంగా వ్యాపారం నడిపిస్తున్నారు. స్టూడెంట్స్‌లోనే కొందరిని ఏజెంట్లుగా వాడుకుంటూ మరింత మందిని ఈ ఊబిలోకి లాగుతున్నారు. కిలోల కొద్ది స్టూడెంట్స్ వద్దకు చేర్చి వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి తోటి స్టూడెంట్స్‌కు అమ్మిస్తున్నారు. సిటీలో కాఫీడే సెంటర్లు, బార్లు, పార్కులు గంజాయి అడ్డాలుగా మారిపోతున్నాయి. అడ్డా కూలీలకూ గంజాయిని అలవాటు చేస్తూ వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇక ఉన్నత కుటుంబాల పిల్లలు పబ్బుల్లో గంజాయి తీసుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు.
పట్టుబడినా మళ్లీ..
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగు, రవాణాపైనే ఆధారపడిన కొన్ని ముఠాలు దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని విస్తరిస్తున్నాయి. పట్టుబడినా బెయిల్‌పై వచ్చి మళ్లీ ఇదే వ్యాపారం చేస్తున్నారు. కిలో గంజాయిపై ఐదారువేల లాభం వస్తుండడంతో దీన్ని వదులుకోలేకపోతున్నారు.
మూడు నెలల్లో గంజాయి కేసులు
ఫిబ్రవరి 9: హైదరాబాద్‌లోని దూల్‌పేటలో 30కిలోలు గంజాయి దొరికింది.
ఫిబ్రవరి 22: వైజాగ్ నుంచి జహీరాబాద్‌కు లారీలో బొగ్గు పొడి కింద దాచి తరలిస్తున్న 1,020 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మార్చి 1: విశాఖ ఏజెన్సీ నుంచి తాండూరుకు లారీలో బొగ్గు కింద పాలిథిన్ కవర్లో తరలిస్తుండగా సిద్దిపేట వద్ద 621 కిలోల గంజాయి పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.93,19,500.
ఏప్రిల్ 18: యాదాద్రి జిల్లా పంతంగి టోల్ గేట్ సమీపంలో ఇటుకల మధ్యలో పెట్టి తరలిస్తున్న 1,121 కిలోల గంజాయి సంచులను పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.1,68,22,500.
ఏప్రిల్ 18: కొత్తగూడెం నుంచి సంగారెడ్డికి తరలిస్తున్న19 లక్షల విలువ చేసే 150 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
ఏప్రిల్ 28: హైదరాబాద్‌లో అమ్మడానికి తెచ్చిన 14 కేజీల గంజాయి పట్టుకున్నారు.
శ్రీనివాస్ రెడ్డి గాంజా తాగి సైకో లెక్క మీదమీదకొచ్చెటోడు. ఆయన్ని చూస్తే మొగోళ్లం .. మాకే భయమైతుండె . ఆ బాయిల కాడ దోస్తులతో కల్సి రోజూ గాంజా తాగుతుండె . అటేపు పోవాలంటెనే భయమయ్యేది. ఏం అనకముం దే కొట్టెటోళ్లు. చుట్టు పక్కల ఊర్లల్ల కూడా గాంజా తాగుతున్నరు.ఇంతోడు, అంతోడు అని లేదు..అందరూ అలవాటైన్రు. పోలీసోళ్లు అట్లొచ్చి ఇట్ల పోతరు. గాంజా తాగెటోళ్లను పట్టుకపోతెనే బుద్ధొస్తది.- హాజీపూర్ లో ఓ పెద్దమనిషి ఆవేదన
హాజీపూర్ ప్రజలతో మాట్లాడాం. అక్కడియువత గంజాయికి బానిసైనట్టు మాదృష్టికొచ్చింది. వారికి కౌన్సెలింగ్ పెట్టిస్తాం. ఇప్పటికే బెల్టు షాపులు మూయించాం.గంజాయి నివారణకు చర్యలు తీసుకుంటాం.- హాజీపూర్ ఘటనపై సీపీ మహేశ్ భగవత్
వరంగల్ జైలుకు శ్రీనివాస్ రెడ్డి
14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
యాదాద్రి, వెలుగు:సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి భువనగిరి కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు అతడిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కేసును లోతుగా విచారించేందుకు త్వరలోనే అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు కోర్టులో రేపోమాపో పిటిషన్ వేయనున్నారు. శ్రావణి, మనీషా, కల్పనను రేప్ చేసి చంపిన శ్రీనివాస్‌రెడ్డిపై ఐపీసీ 302, 376, 201(హత్య, అత్యాచారం, సాక్ష్యాలను దాచిపెట్టడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం అతడిని భువనగిరి కోర్టులో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు.
డీఎన్‍ఏ పరీక్షల కోసం పడిగాపులు
శ్రీనివాస్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం కల్పనను హత్య చేసి డెడ్‌బాడీని బావిలో పాతిపెట్టగా.. పోలీసులకు 8 ఎముకలు, మూతలేని టిఫిన్ బాక్స్, చెప్పులు, దుస్తులు, గోనె సంచి దొరికిన సంగతి తెలిసిందే. ఈ ఎముకలు కల్పనవేనని నిర్ధారించుకునేందుకు పోలీసులు ఆమె తల్లిదండ్రులకు డీఎన్‍ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు బుధవారం ఉదయం 11 గంటలకు ఆమె తల్లిదండ్రులు భువనగిరిలోని ఏరియా ఆసుపత్రికి వచ్చారు. సాయంత్రానికి కూడా పరీక్షల కోసం రక్త నమూనాలను సేకరించలేదు. దీంతో వారు గ్రామానికి తిరిగి వెళ్లారు.
నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడిగిండు:తుంగని భాగ్యమ్మ, కల్పన తల్లి
శ్రీనివాస్‍రెడ్డిని పట్టుకొని కొట్టినప్పుడు పోలీసులు పట్టుకు పోయిండ్రు. మైసిరెడ్డిపల్లికి చెందిన వివాహితపై బలాత్కారానికి యత్నించడంతో ఇతడిపై అనుమానం వచ్చింది. నా కూతురు కల్పనను వీడే ఏమో చేసుంటాడని అనుమానం వచ్చి ఎస్సై దగ్గరికి పోయినం. ‘నీ దగ్గర సాక్ష్యం ఏముంది? నువ్వు చూసినవా?’ అని పట్టించుకోలే. మళ్లా నేనూ, మా ఆయన పోయి అడిగినా అట్లనే మాట్లాడిండు.