
భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేయొద్దని కౌంటరు దాఖలు చేశారు పోలీసులు. ఆమెపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం ఏ మాత్రం లేదన్న పోలీసులు.. సాక్ష్యాలు సేకరించేందుకు దర్యాప్తు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని..అఖిలప్రియ బెయిల్ పై వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్నారు.
ఆమె చర్యల వల్ల స్థానిక ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని.. ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి అఖిల ప్రియకు ఉందన్నారు. బెయిల్ పై విడుదలైతే దర్యాప్తును, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని.. మరిన్ని నేరాలకు పాల్పడవచ్చన్నారు. బెయిల్ ఇస్తే, కేసు విచారణ నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు పోలీసులు.
బాధితులను బెదిరించి సంతకాలు చేయించుకున్న పత్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేశాక కిడ్నాప్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని అందుకు అఖిల ప్రియను రేపటి నుంచి ఈ నెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు.