- తమ పార్టీ లీడర్లకు వార్నింగ్ ఇస్తూ.. విలేకర్లను కించపరిచేలా మాట్లాడిన గండ్ర
శాయంపేట, వెలుగు: ‘ఏదైనా ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పాలి. లేదంటే ఫోన్ చేసైనా చెప్పొచ్చు. ఇంత మందిలో అడిగితే ‘‘వాడు’’ వచ్చి ఎమ్మెల్యేకు చుక్కెదురు అని వార్తలు రాస్తడు. ఇదేం పద్ధతిగా లేదు. పార్టీలో సీనియర్లు అయి ఉండి ఎక్కడ ఏం మాట్లాడాలో తెల్వదా.’ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సొంత పార్టీ లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే జర్నలిస్టులను కించపరుస్తూ మాట్లాడారు. విలేకర్లను ‘వాడు’ అని సంబోధిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సొంత పార్టీ లీడర్లు, స్థానిక ఎంపీటీసీ బాసాని చంద్రప్రకాశ్, శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి ఎమ్మెల్యేను నిలదీశారు. పీఏసీఎస్ వాళ్లకు గతంలో కొనుగోలు కేంద్రం బాధ్యతలు ఇస్తే రూ.6 లక్షల అవినీతికి పాల్పడ్డారని, రైతులకు బార్‌దాన్ల పైసలు ఇయ్యలేదని మండిపడ్డారు. కనీసం కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ ఉన్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్, ఎంపీపీ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ చంద్రప్రకాశ్, సర్పంచ్ రవి మధ్య కాసేపు గొడవ జరిగింది. ఎమ్మెల్యే గండ్ర కలగజేసుకుని ఎంపీటీసీ, సర్పంచ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీనియర్లు అయిఉండి ఎక్కడ ఏం మాట్లాడాలో తెల్వదా అని మందలించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సంయమనం కోల్పోయి జర్నలిస్టుల పట్ల అనుచితంగా మాట్లాడారు. అనంరతం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర.. మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలు విలేకరులను ఉద్దేశించి కాదని, ఒకవేళ ఎవరైనా అలా భావిస్తే తన మాటలను వెనక్కి
తీసుకుంటున్నానని చెప్పారు.