అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: రెండేండ్లలో కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. గడిచిన రెండేండ్లలో భూపాలపల్లి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

మరో రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు జీవోలు విడుదలైనట్లు పేర్కొన్నారు. రానున్న ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంటే, మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. అభివృద్ధి పనులపై ఎవరికైనా సందేహాలు ఉంటే అధికారికంగా వివరాలు తెలుసుకోవచ్చని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, పట్టణాధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, నాయకులు అప్పం కిషన్, ముంజాల రవీందర్, పిప్పాల రాజేందర్ పాల్గొన్నారు.