
- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం
భూదాన్ పోచంపల్లి, వెలుగు: ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలకు భూములు పంచడానికి ఉంచిన భూదాన్ భూములను ధరణి పేరుతో బీఆర్ఎస్ నాయకులు పంచుకున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో భూదాన్ ఉద్యమ సృష్టికర్త వినోబా భావే 130వ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోబాభావే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గతంలో పేద ప్రజల పక్షాన గత కాంగ్రెస్ ప్రభుత్వం భాగమై 43 లక్షల పేదలకు భూదానం చేసిందన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో భూదాన్ భూములన్నీ తమ సొంత నాయకులకు ధరణి ద్వారా పట్టాలు చేసి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. భూదాన్ భూములపై త్వరలోనే స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తామని భూదాన్ భూములను కాజేసిన ఎవరిని కూడా ప్రభుత్వం విడిచి పెట్టే ప్రసక్తే లేదని వారు తెలిపారు.
త్వరలోనే భూదాన్ పోచంపల్లి లో భూదాన్ ఉద్యమం ప్రారంభమై 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా భూదాన్ పోచంపల్లికి సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ చైర్మన్ గోనె రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తడక వెంకటేశం, మండల అధ్యక్షుడు పాక మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.