భువనగిరిలో గెలుపు బీజేపీదే : బూర నర్సయ్యగౌడ్

భువనగిరిలో గెలుపు బీజేపీదే : బూర నర్సయ్యగౌడ్

నకిరేకల్, వెలుగు : కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, భువనగిరిలో గెలుపు బీజేపీదేనని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలుత సంప్రదాయ దుస్తులతో  పార్టీ శ్రేణులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు స్థానిక కనకదుర్గ ఆలయంలో బూర నర్సయ్యగౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి 400 స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుందన్నారు. గతంలో తాను పార్లమెంట్​సభ్యుడిగా పనిచేసిన సమయంలో రూ.9 వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 20 ఎకరాల్లో ఉన్న  ఎయిమ్స్ ప్రభుత్వ దవాఖానను 220 ఎకరాల్లో అన్ని హంగులతో  నిర్మించామని చెప్పారు. తెలంగాణలోనే తొలి కేంద్రీయ విశ్వవిద్యాలయం లాంటి పలు అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. సంపద కోసం వచ్చేవారికి కాకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేసే తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. 

కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, దాసరి మల్లేశం,  మొగులయ్య, అసెంబ్లీ కన్వీనర్ మైల నరసింహ, గోలి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మండల వెంకన్న, మండల, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,  పల్స శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.