మా భద్రతకు ఇజ్రాయెల్, ఉక్రెయిన్ కీలకం : జో బైడెన్

మా భద్రతకు ఇజ్రాయెల్, ఉక్రెయిన్ కీలకం : జో బైడెన్

వాషింగ్టన్/ కైరో: అమెరికా భద్రతకు ఇజ్రాయెల్, ఉక్రెయిన్ దేశాలు కీలకమని, అందుకే ఆ రెండు దేశాలకు అమెరికన్ల నుంచి గట్టిగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్ పర్యటన తర్వాత వాషింగ్టన్ చేరుకున్న ఆయన గురువారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా నాయకత్వమే  ప్రపంచాన్ని ఒక్కటిగా కలిపి ఉంచుతుందన్నారు. ఆ రెండు దేశాలకు కొన్ని బిలియన్  డాలర్ల విలువైన మిలిటరీ సాయం చేయాలంటూ కాంగ్రెస్ (పార్లమెంట్)ను కోరనున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. టెర్రరిస్టులు, నియంతలు తగిన మూల్యం చెల్లించుకునేలా చేయకపోతే.. వారు మరింతగా మారణహోమానికి పాల్పడతారని చరిత్రే పాఠం చెప్పిందని బైడెన్ అన్నారు.

ఈజిప్టుకు రిషి సునాక్

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం ఈజిప్టుకు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సీసీతో భేటీ అయ్యారు. ఈజిప్ట్ బార్డర్ ఓపెన్ చేసి గాజాలోకి మానవతా సాయం అందేలా చూడటం, బ్రిటిష్ పౌరులను తీసుకురావడంపై చర్చలు జరుపుతున్నారని బ్రిటన్ తెలిపింది.