చైనాకు బైడెన్ హెచ్చరికలు

చైనాకు బైడెన్ హెచ్చరికలు

టోక్యో : తైవాన్‌‌‌‌పై చైనా దాడికి దిగితే.. తమ మిలిటరీని రంగంలోకి దించుతామని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడి తర్వాత తైవాన్‌‌‌‌ను రక్షించాలన్న తమ సంకల్పం మరింత బలోపేతం అయిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జపాన్​లో పర్యటిస్తున్న జో బైడెన్.. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడతో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘తైవాన్‌‌‌‌పై చైనా దాడికి దిగితే అడ్డుకునేందుకు మిలిటరీని దించుతారా’ అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అవును.. గతంలో మేం మాటిచ్చాం’’ అని బదులిచ్చారు.  ‘‘వన్ చైనా పాలసీని మేం అంగీకరించాం. దానిపై సంతకం కూడా చేశాం. కానీ దాన్ని (తైవాన్‌‌‌‌ను) బలవంతంగా తీసుకోవచ్చనే ఆలోచన సరైనది కాదు” అని చెప్పారు. ‘‘తైవాన్‌‌‌‌ విషయంలో చైనా చేసే ఏ ప్రయత్నమైనా అక్కడితోనే ఆగిపోదు. మొత్తం రీజియన్‌‌‌‌నే అనిశ్చితిలోకి నెట్టివేస్తుంది. ఉక్రెయిన్‌‌‌‌లో జరిగిన దానికి సమానమైన మరొక చర్యలా మారుతుంది’’ అని చెప్పారు. అక్కడ చైనా విన్యాసాలు చేస్తూ ఇప్పటికే ప్రమాదంతో చెలగాటమాడుతున్నదని, తైవాన్‌‌‌‌ గగనతలంలోకి వెళ్తున్నదని అన్నారు. అయితే బలవంతంగా తైవాన్‌‌‌‌ను చైనా స్వాధీనం చేసుకుంటుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఉక్రెయిన్‌‌‌‌లో తన అనాగరిక చర్యతో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మూల్యం చెల్లించుకుంటారని, తైవాన్‌‌‌‌పై దాడి చేయకుండా చైనాను నిరోధించడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పారు.ఇండో పసిఫిక్ ట్రేడ్‌‌‌‌ డీల్ ప్రారంభించిన బైడెన్​ :- 
12 ఇండో పసిఫిక్ దేశాలతో కొత్త ట్రేడ్ డీల్‌‌‌‌ను అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ సోమవారం ప్రారంభించారు. ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌లో అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, బ్రూనే, ఇండియా, ఇండొనేసియా, జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం దేశాలు ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో ఈ 13 దేశాల వాటా 40 శాతం పైనే. కరోనా, ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడి కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో.. భవిష్యత్తు కోసం మన ఆర్థిక వ్యవస్థలను సిద్ధం చేయడానికి ఈ ఒప్పందం తమకు సహాయపడుతుందని సభ్య దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. సప్లై చైన్స్, డిజిటల్ వాణిజ్యం, క్లీన్ ఎనర్జీ, కార్మికుల రక్షణ, అవినీతి నిరోధక చర్యల విషయంలో అమెరికా, ఆసియా దేశాలు మరింతగా కలిసి పని చేస్తాయని వైట్‌‌‌‌హౌస్ ఒక ప్రకటనలో చెప్పింది.

మరిన్ని వార్తల కోసం : -

భారత్ సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం


సింహంతో పరాచకం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..