
ఆధార్.. దేనికైనా ఇదే ఆధారం అయిపోయింది. ఒకప్పుడు రేషన్ కార్డు మాదిరి.. ఇప్పుడు ఆధార్ కంపల్సరీ అయ్యింది. ఈ ఆధార్ లో మార్పులు అనేవి ఇప్పుడు ఫ్రీ కాదు.. ఫీజులు వసూలు చేస్తున్నారు. నిన్నటి వరకు ఉన్న ఫీజులను ఇప్పుడు భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ అప్ డేట్ కోసం మీరు ఈ ఫీజులను చెల్లించాల్సిందే. ఆధార్ అప్ డేట్ ఫీజులను భారీగా పెంచిన ప్రభుత్వం.. ఏ సేవకు ఎంత ఛార్జీనే కూడా స్పష్టంగా చెప్పింది. ఈ పూర్తి వివరాలు మీ కోసం...
బయోమెట్రిక్ అప్ డేట్ కోసం రూ.125
ఆధార్ లో బయోమెట్రిక్, ఐరిస్ స్కాన్ అప్ డేట్.. అదేనండీ వేలి ముద్రలు, మీ కళ్లు స్కానింగ్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలంటే ఇప్పుడు 125 రూపాయలు చెల్లించాలి. ఈ సేవ కోసం 100 రూపాయలు ఉన్న ఫీజును.. 25 రూపాయలు పెంచి.. 125 రూపాయలు అధికారికంగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో.. ఈ సేవ కేంద్రాల్లో 125 రూపాయలతోపాటు అదనంగా సేవా ఛార్జీలు కూడా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.
అడ్రస్ ఛేంజ్, మొబైల్ నెంబర్ మార్పు కోసం రూ.75
మరో ముఖ్యమైన అప్ డేట్ ఏంటంటే.. మీరు పేరు, ఫొటో మార్పు, ఇంటి అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మార్చుకోవాలన్నా.. అప్ డేట్ చేసుకోవాలన్నా ఇక నుంచి 75 రూపాయలు చెల్లించాలి. ఇప్పటి వరకు ఈ ఛార్జీ 50 రూపాయలుగానే ఉంది. 25 రూపాయలు పెంచి.. 75 రూపాయలు చేసింది ప్రభుత్వం.
ALSO READ : మోడీ తెలివైన నాయకుడు..
ఇంటికొచ్చి పనులు చేస్తే రూ.700
ఆధార్ సంబంధిత ఏ అప్ డేట్ అయినా.. సేవలు అయినా ఇంటికొచ్చి కూడా చేస్తారు. మీరు ఇంట్లోనే ఆధార్ సేవలను పొందొచ్చు. దీని కోసం 350 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నిన్నటి వరకు.. ఇప్పుడు ఈ ధరలను డబుల్ చేశారు. 700 రూపాయలకు పెంచారు. ఇక్కడ ఓ కండీషన్ పెట్టారు. ఒకే ఇంట్లో చాలా మంది వ్యక్తులు తమ ఆధార్ అప్ డేట్ కోసం ధరఖాస్తు చేసుకుంటే.. అది కూడా హోం సర్వీస్ అయితే.. మొదటి వ్యక్తి 700 రూపాయలు చెల్లించాలి.. మిగతా ప్రతి వ్యక్తి 350 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఏదిఏమైనా హోం సర్వీస్ మాత్రం 700 రూపాయలకు పెంచారు.
ఆన్ లైన్ లో ఫ్రీ.. సెంటర్ కు వెళితే రూ.75
ఆధార్ ఆన్ లైన్ సేవల్లో కొంచెం వెసలుబాటు ఇచ్చింది ప్రభుత్వం. ఆధార్ అప్ డేట్ కోసం ఆన్ లైన్ డాక్యుమెంట్లు అప్ లోడ్ చేస్తే అది ఫ్రీ.. ఉచితం. అదే మీరు ఆధార్ సెంటర్ కు వెళితే మాత్రం 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ అప్ లోడ్ ఫ్రీ కూడా 2026, జూన్ 14వ తేదీ వరకు మాత్రమే. ఆ తర్వాత ఛార్జీలు విధించే అవకాశం ఉంది.
పిల్లల విషయంలో కనికరించారు :
చిన్న పిల్లల ఆధార్ మార్పుల విషయంలో కనికరం చూపించింది UIDAI.. 5 నుంచి 7 సంవత్సరాలు, 15 నుంచి 17 సంవత్సరాల పిల్లల బయోమెట్రిక్ అప్ డేట్ ఉచితంగా ఉంటుందని స్పష్టం చేసింది ఆధార్ సంస్థ. దీని కోసం ఆధార్ సెంటర్లలోనూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది ఆధార్.
ఆధార్ అప్ డేట్, ఆధార్ మార్పులపై ఫీజులు భారీగా పెంచటాన్ని ఆధార్ కార్డుదారులు గుర్తించండి.. పెరిగిన ధరలు 2028, సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.