రాజస్థానీలు ఈ సారి ఎవరికి పట్టంగడతారో

 రాజస్థానీలు  ఈ సారి   ఎవరికి పట్టంగడతారో

దేశంలోనే వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్థాన్‌‌లో శాసనసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి అశోక్‌‌ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్‌‌ ప్రయత్నాలు సాగిస్తుంటే.. ఆయనను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 2003 తర్వాత ఏ ప్రభుత్వాన్నీ వరుసగా గెలిపించని రాజస్థానీలు  ఈ సారి తమ కోటలో ఎవరికి పట్టంగడతారో అని దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

రాజస్థాన్​లో  ప్రభుత్వ మార్పు సంప్రదాయం బీజేపీకి కలిసి వచ్చే అంశమే. అయినా, ‘ఈ సారి నాకు, వచ్చేసారి నీకు’ అని వాటాలు పంచుకునేంత అనుకూల పరిస్థితులు ఇప్పుడు రాజస్థాన్‌‌లో లేవు. 1999–2003  కాలంలో అశోక్‌‌ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వ మార్పు సంప్రదాయం ప్రారంభమైంది. ఇప్పుడు తానే ఈ సంప్రదాయాన్ని బ్రేక్‌‌ చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌‌ మధ్య ఉత్కంఠ పోరుకు తలుపులు తెరుచుకున్నాయి. గెహ్లాట్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బీజేపీ రెండు వ్యూహాలను తెరపైకి తీసుకొచ్చింది. మొదటిది గెహ్లాట్ ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడం. పేపర్‌‌ లీకేజీ కుంభకోణంతోపాటు నిరుద్యోగం, మహిళలు, దళితులపై దాడులు పెరిగాయంటూ గెహ్లాట్​పై బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌‌ నాయకుల అవినీతిని బయటపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీతో దాడులు కూడా చేయిస్తోంది. ఈ సెప్టెంబర్‌‌లో జల్‌‌ జీవన్‌‌ మిషన్‌‌, ఐటీ శాఖల అధికారులపై, కాంట్రాక్టర్లపై దాడులు చేసి 15 కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. కానీ, ఈ అవినీతి ఘటనలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమైంది. రాష్ట్ర నాయకత్వ నిర్మాణ లోపానికి అదొక నిదర్శనం.

బీజేపీ పరివర్తన్‌‌ యాత్రల వ్యూహం

 రాజస్థాన్‌‌లో పరివర్తన్‌‌ యాత్ర అనగానే గుర్తుకొచ్చే మొదటిపేరు వసుంధర రాజే. ఆమె రాజకీయ జీవితమంతా యాత్రలతోనే ముడిపడి ఉంది. 2003 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె 13వేల కిలోమీటర్లు పరివర్తన్‌‌ యాత్ర చేసి, రాజస్థాన్‌‌ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఒక దశాబ్దం తర్వాత మళ్లీ అదే యాత్ర చేపట్టి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి మూడోసారి యాత్ర చేపట్టిన రాజే, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే, ఈసారి పరివర్తన్‌‌ యాత్ర కేవలం వసుంధర మాత్రమే చేయడం లేదు. జాతీయ నాయకత్వం ఆదేశాలతో రాజస్థాన్‌‌ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌‌ షెకావత్‌‌, ఆ రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు సతీశ్‌‌ పూనియా కూడా పరివర్తన్‌‌ యాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్‌‌ 2న హడావిడిగా కేంద్రమంత్రుల చేతులమీదుగా మొదలైన ఈ యాత్రలు అనుకున్నంతగా ప్రజలను ఆకట్టుకోవడంలేదు. దీనికి ప్రధానకారణం వీటిని ఆలస్యంగా ప్రారంభించడమే. ఈ యాత్రలకు సగటున వెయ్యి, రెండు వేల మంది మాత్రమే హాజరవుతున్నారు. 2003, 2013లో వసుంధర రాజే చేపట్టిన చిన్న ర్యాలీలకు కూడా కనీసం పదివేల మంది వచ్చేవారు. అదే గెహ్లాట్​ని రెండుసార్లు గద్దె దించింది. కానీ, రాజే ఈ సారి మనస్ఫూర్తిగా యాత్ర చేయడం లేదని, అందుకే తక్కువమంది వస్తున్నారని గుసగుసలు కమలం పార్టీలో వినిపిస్తున్నాయి. సెప్టెంబర్‌‌ 29న పరివర్తన్​ యాత్ర చేపట్టిన నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేపీ నడ్డా, అమిత్‌‌ షా ఈ యాత్రల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌‌ 25న జైపూర్‌‌ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నప్పుడు జనాల్లో ఆ జోష్‌‌ కనిపించలేదని ఫీడ్‌‌ బ్యాక్‌‌ అందడం పట్ల కూడా జాతీయ నాయకత్వం పెదవి విరిచింది.

మోదీ ఆకర్షణపైనే బీజేపీ ఆశలు

ఇప్పటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ హైకమాండ్​ ఖరారు చేయలేదు. ప్రధానమంత్రి మోదీ ఆకర్షణపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనయినట్టు రాష్ట్ర బీజేపీలో ప్రధాన నాయకుల సంఖ్య  ఎక్కువ కావడంతో ఎవరిని సంప్రదించాలో తెలియక పార్టీ కేడర్‌‌ గందరగోళంలో ఉంది. దీనికి భిన్నంగా గెహ్లాట్​తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఛత్తీస్‌‌గఢ్, మధ్యప్రదేశ్‌‌ రాష్ట్రాల్లో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ రాజస్థాన్‌‌లో అంతర్గత కుమ్ములాటలతో ఆ సాహసం చేయలేకపోయింది.  గెహ్లాట్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. అయితే, ఆయన పథకాలు ప్రజాదరణ పొందాయి. తమ సంక్షేమ పథకాలనే ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మార్కెట్‌‌లో 1100 రూపాయలు ఉన్న వంట గ్యాస్‌‌ సిలిండర్‌‌ని 500 రూపాయలకే అందించడం, మహిళలకు ఉచితంగా స్మార్ట్‌‌ ఫోన్లు ఇవ్వడం, ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు స్కూటర్లు అందివ్వడం, 25 లక్షల రూపాయల హెల్త్‌‌ బీమా కవరేజ్‌‌ ఇవ్వడం, పేద కుటుంబాలకు ఉచితంగా ఆహార ప్యాకెట్లు పంచడం వంటి పథకాలు కాంగ్రెస్‌‌ ప్రభుత్వానికి  సానుకూలంగా మారాయి. పాత పెన్షన్‌‌ పథకాన్ని పునరుద్ధరించడంతో ఉద్యోగులు కాంగ్రెస్‌‌ పక్షాన నిలబడ్డారు. మరోవైపు ఉచితాలతో ఆర్థిక నష్టమని వ్యతిరేకిస్తున్న బీజేపీ, గెహ్లాట్​పథకాలకు ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పలేకపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వస్తేసంక్షేమ పథకాలు ఉండవనే భయాన్ని కలిగించడంలో కాంగ్రెస్‌‌ విజయవంతమైంది.

ఇరు పార్టీల్లోనూ సందిగ్ధాలు!

2030 వరకు తానే సీఎం అని చెప్పడం ద్వారా, ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న సచిన్‌‌ పైలట్‌‌కి చెక్‌‌ పెట్టాలని గెహ్లాట్​ భావిస్తున్నారు. గెహ్లాట్​కు బీజేపీ కంటే పార్టీలోని సచిన్‌‌ పైలట్‌‌ నుంచే సవాలు ఎదురవుతోంది. ఎప్పటినుంచో యువనేతగా సీఎం కుర్చీపై కన్నేసిన సచిన్‌‌ పైలట్‌‌ను పార్టీ అధిష్టానం బుజ్జగిస్తూ వచ్చింది. ఎన్నికలవేళ ప్రత్యర్థి బీజేపీతోపాటు సొంతపార్టీలో సచిన్‌‌ పైలట్‌‌ను కూడా ఎదుర్కోవడం గెహ్లాట్​కు కత్తిమీద సామే. కాంగ్రెస్‌‌ పథకాలు మళ్లీ అధికారాన్ని తెచ్చిపెడతాయా? కాంగ్రెస్‌‌లో వర్గపోరు ఎలా ఉండబోతుంది? అంశాలు కాంగ్రెస్‌‌ విజయావకాశాలను నిర్ణయిస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొన్ని నెలల వ్యవధిలో పదిసార్లు రాజస్థాన్‌‌లో పర్యటించారంటే ఆ పార్టీ మోదీపై ఎంత ఆధారపడిందో అర్థమవుతోంది. కేవలం మోదీ ప్రచారంపైనే ఆధారపడితే రాజస్థాన్‌‌లో గెలుపు సాధ్యమేనా? ఒకవేళ కర్నాటకలోలాగా మోదీ ఫార్ములా  ఇక్కడ కూడా పనిచేయకపోతే ఎలా అనే సందిగ్ధం బీజేపీ నేతల్లో నెలకొంది. 

బీజేపీ సీఎం రేసులో హేమాహేమీలు


బీజేపీ బూత్‌‌ స్థాయి నాయకుల నుంచి రాష్ట్రస్థాయి నాయకుల వరకూ ప్రతి ఒక్కరి మనసులో రాజే కాకుంటే, మరెవరు? అనే ప్రశ్న ప్రారంభమైంది. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌, లోక్‌‌సభ స్పీకర్‌‌ ఓం బిర్లా, రాజస్థాన్‌‌ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్, రాజస్థాన్‌‌ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, ఆర్గనైజేషనల్‌‌ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌‌ సీఎం రేసులో ఉన్నారు. అయితే వీరిలో ఎవరికి ప్రజాదరణ ఉంది? ఎవరు ఓటర్ల మనసు గెలుచుకోగలరు? వాటిని ఎవరు ఓట్లుగా మరల్చగలరు? అనే సందేహాలు బీజేపీని వెంటాడుతున్నాయి. ఇప్పటికీ రాజస్థాన్‌‌లో బీజేపీ అంటే బైరన్‌‌ సింగ్‌‌ షెకావత్‌‌, వసుంధర రాజే పేర్లను మాత్రమే ప్రజలకు గుర్తుకొస్తున్నాయంటే వారి ప్రభావం ఏమేరకుందో  తెలుస్తోంది. కాంగ్రెస్‌‌లో తనకు ఎదురు లేదని, మళ్లీ తనే ముఖ్యమంత్రిని అని బలంగా నమ్ముతున్న  గెహ్లాట్​ ‘మిషన్‌‌ 2030’ ప్రకటనతో ప్రజల ముందుకొచ్చారు.

వసుంధర రాజే ప్రాధాన్యత తగ్గిందా?

70 ఏండ్లు దాటిన నాయకులు గెహ్లాట్, వసుంధర రాజే వరసగా 5 సార్లు ఎన్నికల్లో పోటీ పడ్డారు. మూడు సార్లు గెహ్లాట్ ముఖ్యమంత్రి కాగా, ఇప్పుడు రాజే మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటున్నారు. ఈ సారి వసుంధర రాజే నేతృత్వంపై బీజేపీ నుంచి ఇప్పటివరకు స్పష్టత రాలేదు.  రాజే వ్యతిరేక శిబిరంలో ఉన్న నాయకులు ఆమె లేకున్నా రాజస్థాన్‌‌లో గెలుస్తామని, రాజస్థాన్‌‌ ప్రజలు వరుసగా రెండోసారి ఎవరికీ అధికారమివ్వరని అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 2018 ఓటమి తర్వాత వసుంధరను బీజేపీ హై కమాండ్​నెమ్మదిగా పక్కన పెడుతూ వచ్చింది. అయితే,  ఆమె ప్రాధాన్యత తగ్గించాలనుకున్నా ఆమెకున్న జనాదరణను కాదనలేం. ఇటీవల నిర్వహించిన అనేక సర్వేల్లో అధికశాతం మంది బీజేపీ నుంచి వసుంధర రాజేనే ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం ఇందుకు తార్కాణం.

జి.మురళికృష్ణ, పొలిటికల్ ఎనలిస్ట్​