నేతల ప్రసంగాలు.. 2 కి.మీ దూరం వరకు వినిపించేలా స్పీకర్లు

నేతల ప్రసంగాలు.. 2 కి.మీ దూరం వరకు వినిపించేలా స్పీకర్లు

ప్రధాని మోడీ విజయ సంకల్ప సభ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా తడవకుండా వేదికలు, సభ ప్రాంగణంలో జర్మన్ హ్యాంగర్స్ వేయించారు.  2 లక్షల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ, సభకు 10 లక్షల మంది వస్తారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీల మధ్యలో, ఖాళీ ప్రదేశం వదిలేశారు. సభకు వచ్చే మిగతావారంతా ఈ ఖాళీప్రదేశాల్లో కూర్చొని చూసేలా కింద కార్పెట్లు వేశారు. సభా ప్రాంగణం బయట ఉన్నవారు కూడా కార్యక్రమాలను చూసేందుకు భారీ LED  లను ఏర్పాటు చేశారు. నేతల ప్రసంగాలు 2 కిలోమీటర్ల దూరం వరకు వినిపించేలా స్పీకర్లు పెట్టారు. BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ నోవాటెల్  నుంచి బేగంపేట్  ఎయిర్  పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి పరేడ్  గ్రౌండ్స్  కు రోడ్డు మార్గంలోనే వెళ్లనున్నారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే రూట్  ను SPG  ప్రత్యేకంగా పరిశీలించింది. ప్రధానితో పాటు సమావేశాల్లో పాల్గొన్న ఇతర ముఖ్య నేతలు కూడా సభలో పాల్గొననున్నారు. వీళ్లంతా మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ కు వివిధ రూట్లలో చేరుకోనున్నారు. ఇందుకోసం టివోలి క్రాస్ రోడ్స్ , ప్లాజా క్రాస్ రోడ్స్ మధ్య రోడ్డును మూసేయడంతో పాటు సికింద్రాబాద్ పరిధిలో ఉండే ఫ్లై ఓవర్లు క్లోజ్ చేయనున్నారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు ట్రాఫిక్  ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. జిల్లాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 20 గ్రౌండ్లను కేటాయించారు. ఆయా పార్కింగ్ ప్రాంతాల గూగుల్ మ్యాప్ వివరాలు పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక వర్షం వచ్చినా సభకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 భారీ జర్మన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎండ బాగా ఉంటే ఇబ్బంది తలెత్తకుండా.. వంద ఏసీలను రెడీగా ఉంచారు. విద్యుత్తు సమస్యలు తలెత్తితే... ప్రత్యామ్నాయంగా సభా ప్రాంగణంలో 50 జనరేటర్లను అందుబాటులో ఉంచారు. 

పరేడ్ గ్రౌండ్ సభకు ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ నాయకులు హాజరవుతుండడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జాతీయ నిఘా సంస్థలు, ప్రత్యేక బృందాలు ప్రతీ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 4 వేల మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ పై ఇద్దరు కానిస్టేబుళ్లు, బైనాక్యులర్స్  తో నిఘా పెట్టారు.