
కాకినాడ: తునిలో బాలిక అత్యాచార కేసు ఊహించని మలుపు తిరిగింది. బుధవారం రాత్రి నిందితుడు తాటిక నారాయణ రావును కోర్టుకు తరలిస్తుండగా మూత్ర విసర్జన కోసం వెళ్లి చెరువులో దూకేశాడు. చెరువులో దూకి గల్లంతైన నిందితుడి కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించగా గురువారం ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. బాలికను తోటలోకి తీసుకెళ్లి నిందితుడు తాటిక నారాయణ రావు అత్యాచారానికి యత్నించగా.. గమనించి వీడియో తీసి నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
నిందితుడు తాటిక నారాయణ రావు టీడీపీ నేత అని ఈ ఘటన జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఏపీలో ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది. తుని పట్టణ శివారులోని కోమటి చెరువులో నిందితుడు దూకినట్లు పోలీసులు తెలిపారు. తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడి మృతదేహాన్ని గజ ఈత గాళ్లు చెరువులో నుంచి బయటకు తీశారు.
తూర్పు గోదావరి జిల్లా తునిలో బాలికపై వృద్ధుడు అత్యాచారానికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలికపై అత్యాచార యత్నానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన తుని రూరల్ పరిధిలో జరిగింది. హంసవరం ప్రాంతానికి చెందిన నారాయణరావు అనే వృద్ధుడు, తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి బయటకు తీసుకువెళ్లాడు. హంసవరం సమీపంలోని సపోటా తోటల్లో బాలికపై అత్యాచారానికి యత్నించడంతో ఈ ఘటన ఏపీలో చర్చనీయాంశమైంది.