
చెన్నై: తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని నీలన్ కారైలో ఉన్న విజయ్ నివాసంలో బాంబు పెట్టామని కాల్ రావడంతో పోలీసులు హుటాహుటిన బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫ్ఫర్ డాగ్స్తో విజయ్ ఇల్లు, ఇంటి పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయితే.. ఎలాంటి బాంబు గానీ, పేలుడు పదార్థం గానీ సోదాల్లో దొరకలేదని పోలీసులు తెలిపారు. ఈ బాంబు కాల్ చేసిందెవరనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరూర్లో జరిగిన విజయ్ ర్యాలీలో ఇప్పటివరకూ 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంత మంది ప్రాణాలు పోవడానికి విజయ్ను బాధ్యుడిగా చేస్తూ విద్యార్థి సంఘాలు ఆయన ఇంటి ముట్టడికి యత్నించాయి. సోషల్ మీడియాలో కూడా విజయ్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు విజయ్కు భద్రత పెంచారు. అతని ఇంటి ముందు పదుల సంఖ్యలో పోలీసులు డ్యూటీలో ఉన్నారు. విజయ్ ర్యాలీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న సుగుణ అనే 65 ఏళ్ల మహిళ సోమవారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. కరూర్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండటం గమనార్హం.
Also Read : రెండు జీవితాలు నటించలేను.. పాత భారాన్ని మోయలేను
తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్ రాష్ట్రవ్యాప్తంగా వరుసగా ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శనివారం (సెప్టెంబర్ 27, 2025) తమిళనాడులోని కరూర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి వేలాది మంది జనం రావడంతో తీవ్ర తొక్కిసలాటకు దారి తీసింది. తొక్కిసలాటలో గాయపడినవారిని కరూర్ జనరల్ హాస్పిటల్కు తరలించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో హాస్పిటల్ పరిసరాల్లో విషాదం నెలకొంది.