
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు కేవలం సినిమాలతోనే కాదు, తన వ్యక్తిగత ఆలోచనలు, జీవిత పాఠాలతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ గా తన జీవితం గురించి లోతైన భావోద్వేగ పోస్ట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మేకప్, హెయిర్ ఆర్టిస్ట్ అవ్ని రాంభియాతో జరిగిన సంభాషణ సందర్భంగా.. ఈ ఆలోచనకు పునాది అని తెలుపుతూ పోయెమ్ రాసి పోస్ట్ చేశారు. ముప్పై ఏళ్లు దాటాక అంతా దిగజారడమే" అనే సామాజిక ఒత్తిడిని ఈ పోస్ట్‌లో ప్రశ్నించారు.
ఇరవైలో గందరగోళం
ముప్ఫై ఏళ్లు దాటాక అంతా దిగజారడమే అనే లోకం మాటను తాను బలంగా నమ్మానని సమంత పేర్కొంది. తన ఇరవైలు అన్నీ తగినంత అందంగా, శక్తివంతంగా ఉండాలి అనే ఒత్తిడితో కూడిన పరుగులోనే గడిచాయని వివరించింది. ఎలాంటి గందరగోళంలో ఉన్నానో ఎవరికీ తెలియకుండా, పైకి ఒక నటన చేయాల్సి వచ్చింది. తాను అప్పటికే సంపూర్ణురాలినని, ఇతరుల కోసం మారాల్సిన అవసరం లేదని, నిజమైన ప్రేమ తనను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తుందని ఎవరూ చెప్పలేకపోయారు అంటూ ఇరవైలో ఎదుర్కొన్న ఆందోళనను గుర్తు చేసుకున్నారు సమంత.
ALSO READ : ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీ..
ముప్ఫైలో మారిన జీవితం
అయితే, ముప్పైలలోకి అడుగుపెట్టాక తన జీవితం మారిందని సమంత స్పష్టం చేసింది. నేను పాత తప్పుల బరువును దించుకున్నాను. ఇతరుల కోసం నన్ను నేను మార్చుకోవడం ఆపేశాను. బయటకు చూపించే జీవితం, మౌనంగా జీవించే రెండు జీవితాలు మానేశాను. అకస్మాత్తుగా, అందరూ చూస్తున్నప్పుడు నేను ఎలా ఉంటానో, ఎవరూ చూడనప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. ఆ క్షణమే నేను ఎన్నడూ లేనంత సజీవంగా ఉన్నట్లు అనిపించింది. స్వీయ-అంగీకారం వల్ల వచ్చిన నిజమైన శాంతి లభించిందని పోస్ట్ లో పంచుకున్నారు.
ప్రతి మహిళ కూడా 'పరుగు ఆపి, తనలోకి తాను తిరిగి వచ్చి' ఆ సంపూర్ణతను, శాంతిని పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు సమంత రాసుకోచ్చారు. వేషం లేకుండా, క్షమాపణ చెప్పకుండా మీరు పూర్తిగా మీలా ఉన్నప్పుడు... మీరు ఈ ప్రపంచం మొత్తాన్నీ విముక్తి చేస్తారు అనే బలమైన సందేశంతో ఈ పోస్ట్‌ను ముగించారు. సమంత చేసిన ఈ పోస్ట్ అభిమానులు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
వృత్తిపరంగా సమంత ప్రస్తుతం రాజ్ & డీకే దర్శకత్వంలో రూపొందుతున్న 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' అనే యాక్షన్ ఫాంటసీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇది కాకుండా, ఆమె తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆమె నిర్మాణంలో వచ్చిన 'శుభం' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వరుస విజయాలతో, కొత్త ప్రాజెక్టులతో, తన యొక్క స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వంతో సమంత రూత్ ప్రభు ఇండస్ట్రీలో తన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు.