
ఏపీలో కలకలం రేపిన వైష్ణవి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. వైష్ణవి హత్య కేసులో కీలక ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు కర్నూల్ రేంజ్ డీఐజీ. బాలికపై అత్యాచారం జరగలేదని వెల్లడించారు. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని అన్నారు. ప్రియుడు లోకేష్ వైష్ణవిని హత్య చేయలేదని తేల్చి చెప్పారు డీఐజీ.
ఘటనాస్థలికి వైష్ణవి అన్న సురేంద్ర వెళ్లడం అనుమానాలకు దారి తీస్తోందని.. హత్య వెనక వైష్ణవి అన్న హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని.. బుధవారం ( జులై 16 ) సాయంత్రానికి అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు డీఐజీ.
అయితే.. వైష్ణవి హత్య వెనుక అన్న సురేంద్ర హస్తం ఉందని అనడం దారుణమని అంటున్నారు తల్లిదండ్రులు. ఎక్కడైనా అన్న చెల్లెలిని వివస్త్రను చేసి చంపుతాడా అంటూ ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు. తమ బిడ్డను హత్య చేసినవారిని ఎన్ కౌంటర్ చేయాలని అంటున్నారు వైష్ణవి తల్లి. వైష్ణవిపై అత్యాచారం జరగకపోతే ఒంటిపై గాయాలెలా వస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు కుటుంబసభ్యులు.
పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు కుటుంబసభ్యులు. లోకేషే తన బిడ్డను హత్య చేసాడని భావిస్తున్నామని.. అతన్ని ఎన్ కౌంటర్ చేయాలని అంటున్నారు వైష్ణవి తల్లి. తనకు జరిగిన అన్యాయం ఏ తల్లికి జరగొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైష్ణవి తల్లి.