
హారర్ సినిమాలు చూడటమే కాదు.. వాటిలో నటించడం కూడా తనకు ఇష్టమని నయనతార ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కనెక్ట్’ ఇటీవలే తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ మరో హారర్ సినిమాలో నటించేందుకు నయనతార రెడీ అవుతోంది. ఖైదీ, విక్రమ్ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్‌తో దూసుకెళ్తున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. త్వరలో నయనతారతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాకు అతను డైరెక్టర్ కాదు. కమల్ హాసన్‌తో కలిసి దీన్ని నిర్మించబోతున్నాడట. ఈ హారర్ థ్రిల్లర్‌కి స్టోరీ మాత్రం అతనే ఇస్తున్నాడట. రత్నకుమార్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో లారెన్స్ హీరోగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. లారెన్స్, నయన్ కలిసి నటించబోయే ఫస్ట్ మూవీ ఇదే కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం షారుఖ్‌కి జంటగా ‘జవాన్’లో నటిస్తోంది నయనతార. అట్లీ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.