జీడిమెట్ల, వెలుగు: బిగ్‌బాస్కెట్ వేర్‌హౌజ్‌లో ఓ కార్మికుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మేడ్చల్ మండలం ఘనపూర్‌కు చెందిన మేక బాబు(27) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి కండ్లకోయలోని బిగ్‌బాస్కెట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఉదయం 9:30 గంటలకు రోజు మాదిరిగానే డ్యూటీకి వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. అతని భార్య ఫోన్‌చేయగా ఫోన్ స్విచాఫ్ వచ్చింది.
ఆదివారం ఉదయం మరోసారి ఫోన్ చేయగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ దొరికిందని చెప్పాడు. అనంతరం మరో వ్యక్తి ఫోన్ చేసి మీ భర్త డ్యూటీలో ఉండగా బాత్రూమ్లో జారిపడి మృతిచెందాడని చెప్పారు. బిగ్‌బాస్కెట్ నిర్వాహకులు పొంతన లేని సమాధానం చెప్పడంతో కుటుంబ సభ్యులు బిగ్బాస్కెట్వేర్ హౌజ్ఆవరణలో ఆందోళన చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
