- ‘టైం సరిపోదులే.. నాకు కుదరదు.’
- ‘నాకు అంత టైం లేదండి..’
- ‘కొంచెం టైం ఉంటే బాగుండు..’
ఇలా మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పరిస్థితుల్లో అనుకునే ఉంటాం. అయితే వాస్తవంగా మాట్లాడుకుంటే ఏ పని చేయడానికైనా ప్రతి మనిషికీ కావాల్సినంత టైం ఉంటుంది. కానీ సమయాన్ని సరిగ్గా వాడుకోకపోవడం వల్లే అవసరమైనప్పుడు టైం సరిపోక ఇలాంటి మాటలు వస్తాయి. అందుకే స్కూల్‌కు వెళ్లే వయసు నుంచి ఉద్యోగాలు చేసే వరకు టైం మేనేజ్మెంట్ గురించి చెప్తూనే ఉంటారు. అవన్నీ విన్నా వాటిని పాటించలేకపోతున్నారంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? అంటే అందుకు కారణం.. టైం మేనేజ్మెంట్ మనకు సరిగా రాకపోవడమే. కానీ ప్రపంచంలో అందరూ అలా లేరు.. జపనీయులు టైంని చాలా బాగా మేనేజ్ చేస్తారు. ఎందుకంటే.. వాళ్ల దగ్గర టైం బ్యాంక్ ఉంది.
సాధారణంగా డబ్బులు దాచుకోవడానికి అయితే బ్యాంక్‌లు ఉంటాయి. కానీ, జపాన్‌లో టైం సేవ్ చేసుకోవడానికి కూడా బ్యాంక్‌లు ఉన్నాయి. జపాన్‌లోని ఒసాకాలో ఉండే టెరుకొ మిజుషిమా అనే వ్యక్తి 1973లో ఫుర్యా కిప్పు పేరుతో టైం బ్యాంక్ కాన్సెప్ట్‌ను ప్రపంచానికి మొదటిసారి పరిచయం చేశాడు. ఫుర్యా కిప్పు అంటే కేరింగ్ రిలేషన్‌షిప్‌కు టికెట్ తీసుకోవడం అని అర్థం. ముసలి వాళ్లు, సహాయం కోరే వాళ్లకు కొన్ని గంటలపాటు ఎవరైనా సర్వీస్ చేస్తే.. ఆ టైం వాళ్లు చేసే ఉద్యోగాల్లో మెరిట్ స్కోర్లా యాడ్ అవుతుంది. దీన్నే టైం కరెన్సీ అంటారు. ఈ కరెన్సీ విలువ అన్ని రకాల పనులకు సమానంగా ఉంటుంది.
దీనివల్ల కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. సమాజానికి మేలు చేసే పనుల్లో భాగం కావొచ్చు. స్వచ్ఛందంగా సొసైటీకి సేవ చేసేవాళ్లకు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. అయితే అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు మొదలుపెట్టారంటే.. ఒసాకా ప్రాంతంలో ప్రజల్లో వృద్ధులు ఎక్కువైపోవడంతో వాళ్లకు సాయం చేయడానికి ఎవరూ లేక ఇబ్బందులు పడేవారు. అందుకే యువత ఈ ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ చూపిస్తుందని నమ్మిన టెరుకో ఈ ఆలోచన చేశాడు. ఇప్పుడు ఒసాకాలోనే కాదు.. జపాన్ అంతటా టైం బ్యాంక్‌లు వెలిశాయి.
టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా
‘టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఇదే కాన్సెప్ట్‌ని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 20 మంది కలిసి టైం బ్యాంక్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టైం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడు వేలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. ఇందులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. కేవైసీ పూర్తయ్యాక అకౌంట్ ఓపెన్ అవుతుంది. తీరిక వేళల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఎంత టైం కేటాయిస్తే అంత పాస్‌బుక్‌లో జమ చేస్తారు.
లేటెస్ట్గా కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న ఎలికుళం పంచాయతీ టైం బ్యాంక్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌ను పంచాయతీలోని అన్ని వార్డుల్లో ఉన్న వృద్ధులను ఏకం చేసే ‘నిరవు @ 60 ప్లస్’ అనే గ్రూప్ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ గ్రూప్ పంచాయతీలో ఉన్న 7,652 మంది సీనియర్ సిటిజన్ల వివరాలను ఇప్పటికే సేకరించింది. అయితే, ఈ బ్యాంక్ ఉద్దేశం ఏంటంటే.. వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టడం. వాళ్లకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందించడం.
రోజువారీ పనుల్లో సాయం చేయడం. ఒక వాలంటీర్ వృద్ధుడికి గంట సమయం కేటాయిస్తే ఆ టైంని అతని పేరుతో టైం బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తారు. ఈ వాలంటీర్‌కు ఫ్యూచర్లో 60 ఏండ్లు దాటిన తర్వాత సాయం అవసరమైనప్పుడు వాళ్లు తమ అకౌంట్లో ఉన్న క్రెడిట్‌ను వాడి వాలంటీర్ సేవలు పొందొచ్చు. ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది క్రమం తప్పకుండా సర్వేలు నిర్వహిస్తుంది. ఈ కాన్సెప్ట్ కేవలం సేవ చేయడానికి మాత్రమే కాదు.. యువతలో సామాజిక బాధ్యను పెంచడానికి, అలాగే తరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి సాయపడుతుందని అధికారులు తెలిపారు.
