బిగ్‌బాస్ రివ్యూ : వామ్మో.. ఏం తెలివి గీతక్కా..!

బిగ్‌బాస్ రివ్యూ : వామ్మో.. ఏం తెలివి గీతక్కా..!

ఇంటివాళ్లతో మాట్లాడుకోవడం, వారి నుంచి బహుమతులు అందుకోవడం లాంటి పాయింట్స్‌తో టాస్కుని ముడిపెట్టాడు బిగ్‌బాస్. దాంతో ఇటు ఆటని బ్యాలెన్స్ చేయలేక, అటు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక నానా తంటాలు పడుతున్నారు హౌస్‌మేట్స్. నిన్న మొదలైన ఈ ఎమోషనల్ గేమ్ ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది. ఇంటి సభ్యులకి పెద్ద పరీక్షే పెట్టింది. అసలేం జరిగింది?

వామ్మో.. ఏం తెలివి గీతక్కా!

టాస్క్ ఏదైనా కానివ్వు.. దాని తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం, ఎవరి గురించీ ఆలోచించకుండా తనదైన శైలిలో స్వార్థంగా ఆడటం గీతూ స్టైల్. ఈసారి కూడా అదే చేసింది. బ్యాటరీ పూర్తిగా లో అయిపోయింది. దాంతో రీచార్జ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందుకుగాను గీతూని పిలిచి రెండు పనులు చెప్పాడు. బ్యాటరీ డెబ్భై శాతం చార్జ్ అవ్వాలంటే ఇంట్లోవాళ్లంతా చక్కెరని త్యాగం చేయాలి. అదే తొంభై శాతం పెరగాలంటే బాలాదిత్య సీజన్ మొత్తం సిగరెట్‌ని త్యాగం చేయాలి. రెండింటిలో దేనికో దానికి ఒప్పించమన్నాడు. క్షణం కూడా ఆలోచించలేదు గీతూ. రెండోదాన్నే ఎంచుకుంది. అయితే బైటికెళ్లి ఆ విషయాన్ని జెన్యూన్‌గా చెప్పలేదు. ఫస్ట్ ఆప్షన్‌ని మార్చేసింది. ఇంట్లోవాళ్లందరూ టాస్క్ అయ్యేవరకు ఫుడ్ త్యాగం చేయాలని చెప్పింది. అది కష్టం కాబట్టి నేను రెండోదే ఎంచుకున్నాను అంటూ తెలివిగా మాట్లాడింది. బాలాదిత్య బేసిగ్గా మంచోడు కాబట్టి క్షణం ఆలోచించకుండా సిగరెట్ మానేయడానికి సిద్ధపడ్డాడు. చివరిసారిగా ఓసారి స్మోక్ చేసి సిగరెట్లన్నీ ఇచ్చేశాడు. అయితే ఈ విషయాన్ని అందరి ముందు కాకుండా తనకి పర్సనల్‌గా చెప్పి ఉంటే బాగుండేదని గీతూ దగ్గర బాధపడ్డాడు. అలవాటు ప్రకారం గీతూ సింపుల్‌గా సారీ చెప్పేసింది. అయితే హౌస్‌మేట్స్కి ఆప్షన్ మార్చి చెప్పడం, బాలాదిత్యని మోసగించడం తప్పని ఆదిరెడ్డి అన్నాడు. గీతూ అలాంటివన్నీ పట్టించుకోదు కదా. తన స్ట్రాటజీ తనదే తప్ప ఎవరి ఎమోషన్స్తోనూ తనకి పని లేదు కాబట్టి లైట్ తీసుకుంది. పైగా ఓ సిగరెట్ కోసం బాధపడేటట్టయితే అలాంటి అన్నయ్యతో నాకు రిలేషనే వద్దు అని డైలాగ్ కూడా కొట్టింది.

కెప్టెన్‌గారు మారలా!

సప్త సముద్రాలన్నీ ఒంటికాలితో ఈది.. ఇంటిముందున్న మురికిగుంటలో పడి చచ్చాడంట వెనకటికి ఎవడో. రేవంత్ తీరు కూడా ఇట్టాగే ఉంది. కెప్టెన్‌గా బెస్ట్ ఇస్తున్నాడని నాగార్జున దగ్గర కాంప్లిమెంట్స్ కొట్టేశాడు. ఆ తర్వాత హౌస్‌పై మరింత పట్టు బిగించేశాడు. ప్రతిదానికీ అది కుదరదు, ఇలా చేయకూడదు అంటూ రూల్స్ మాట్లాడుతున్నాడు. అందరినీ వెంటపడి సాధించి తన మాట నెగ్గించుకుంటున్నాడు. కానీ మాటిమాటికీ నిద్రపోయి బిగ్‌బాస్‌కి దొరికేస్తున్నాడు. నిన్న ఓసారి నిద్రపోతే కుక్కలు మొరిగాయి. పైగా బ్యాటరీ చార్జింగ్ కూడా కోసేశాడు బిగ్‌బాస్. అయినా రేవంత్ తీరు మారలా. ఇవాళ రెండుసార్లు నిద్రపోయాడు. అందరూ ఎమోషనల్‌గా ఉన్నారు. ఎవరికి ఎప్పుడు పిలుపు వస్తుందో, సర్‌‌ప్రైజ్ దొరుకుతుందో లేదోనని టెన్షన్ పడుతున్నారు. రేవంత్ మాత్రం ఎక్కడో ఒకచోట పడుకుని నిద్రపోతూనే ఉన్నాడు. కుక్కలు మొరిగాయి. బ్యాటరీకి రెండుసార్లు కోతలు కూడా పడ్డాయి. కాబట్టి ఈ వీకెండ్‌కి నాగార్జున చేతిలో అక్షింతలు కూడా బాగానే పడతాయి.

త్యాగరాజు కన్‌ఫ్యూజన్

బిగ్‌బాస్ హౌస్‌లో త్యాగరాజు ఎవరు అని అడిగితే షో చూసేవాళ్లెవరైనా ఠక్కున చెప్పేస్తారు అర్జున్ కళ్యాణ్ అని. అతనికి హౌస్‌లో శ్రీసత్య తప్ప ఎవ్వరూ కనిపించరు. ప్రతి విషయాన్నీ ఆమెతో ముడిపెడతాడు. ఇవాళ కూడా అదే చేశాడు. బిగ్‌బాస్ పిలిచి సర్‌‌ప్రైజ్ సెలెక్ట్ చేసుకోమంటే.. నా వీడియో కాల్ ఆప్షన్‌ని సత్యకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా, తనకి వాళ్లమ్మగారితో మాట్లాడాలని ఉంది అంటూ బిగ్‌బాస్‌కే ప్రపోజల్ పెట్టాడు. బిగ్‌బాస్‌కి కోపమొచ్చినా పైకి ఎక్స్ప్రెస్ చేయడు కాబట్టి.. నీకేం కావాలో అది సెలెక్ట్ చేసుకో అంటూ సున్నితంగానే చెప్పాడు. అన్ని టాస్కుల్లో కన్‌ఫ్యూజ్ అయినట్టే ఇక్కడా అయిపోయాడు అర్జున్. ఫుడ్‌కి చాలా తక్కువ పర్సంటేజ్ పెట్టారు. కాల్‌కి కాస్త ఎక్కువ పెట్టారు. వీడియో మెసేజ్‌కి అన్నిటికంటే ఎక్కువ కోత పడుద్దన్నారు. అతను వీడియో మెసేజ్ తీసుకున్నాడు. బైటికొచ్చాక నీకోసం అడిగితే బిగ్‌బాస్ ఒప్పుకోలేదు అని సత్యకి చెప్పాడు. అలా ఎందుకు అడుగుతావ్, నా చాన్స్ నాకొస్తుంది కదా, మీరందరూ ఇలా అడిగితే ఆయన నన్ను చివరి వరకు పిలవడు అని చిరాకుపడిందామె. నీకు కాల్ అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే ఫుడ్‌కి తక్కువ ఉన్నప్పుడు అది తీసుకోవాల్సింది కదా, వేరేవాళ్లకి చాన్స్ వచ్చేది కదా, అలా ఆలోచించి ఆడాలి అని చెప్పింది. దాంతో మనోడు మళ్లీ ఫీలైపోయాడు. కెమెరా దగ్గరకు వెళ్లి.. వీలైతే నా ఆప్షన్ మార్చండి బిగ్‌బాస్, నాకు ఫుడ్ చాలు అంటూ అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్ అని మళ్లీ చీవాట్లు పెట్టింది శ్రీసత్య. 

ఫన్నీ టాస్క్.. ఫైమా పాస్

పడిపోయిన బ్యాటరీని మరోసారి రీచార్జ్ చేయడానికి ఓ ఫన్నీ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. కొన్ని సినిమా పేర్లు ఇస్తారు. వాటి కథల్ని ఫైమా ఇంగ్లిష్‌లో వివరించాలి. హౌస్‌మేట్స్ వాటిని గెస్ చేయాలి. ఇచ్చిన టైమ్‌ లోపల ఎన్ని కథల్ని వాళ్లు గెస్ చేయగలిగేలా చేస్తే అంత బ్యాటరీ వస్తుంది. ఈ టాస్క్ని అద్భుతంగా పూర్తి చేసింది ఫైమా. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, స్వాతిముత్యం లాంటి సినిమాల కథల్ని తనదైన స్టైల్లో ఇంగ్లిష్‌లో చెప్పింది. అందరూ అన్నీ గెస్‌ చేయడంతో ఫుల్ బ్యాటరీ వచ్చింది. ఇనయా విషయంలో కూడా ఇవాళ మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి మెప్పించింది ఫైమా. ఆమె ఓ విషయంలో ఫైమాని బాధపెట్టింది. ఆ విషయాన్ని ఇనయాకి సూర్య ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతో ఆమె వెళ్లి ఫైమాకి సంజాయిషీ ఇచ్చింది. సారీ చెప్పింది. మరేం ఫర్వాలేదంటూ తేలికగా కొట్టి పారేసిన ఫైమా.. తన ఫ్యామిలీ కోసం బాధ పడుతున్న ఇనయాని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పింది. తనకిచ్చిన ఆప్షన్స్లో ఫొటో ఫ్రేమ్ తప్ప ఏదీ తీసుకునే అవకాశం లేక ఇనయా దానినే ఎంచుకుంది. ఆ విషయంలో కూడా బాధపడుతుంటే తన మాటలతో ఆమె బాధని తగ్గించే ప్రయత్నం చేసింది ఫైమా.  

బాల ఎమోషన్.. గీతూ ఓవరాక్షన్

బాలాదిత్యకి తన ఫ్యామిలీతో మాట్లాడాలని చాలా ఆశగా ఉంది. సిగరెట్ మానేయడంతో కాస్త లో కూడా అయ్యాడు. అందుకే బ్యాటరీ జీరో అయిపోతుందని తెలిసినా భార్యతో ఫోన్‌ కాల్‌నే ఎంచుకున్నాడు. కాల్ వచ్చినప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. కాసేపు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత తమాయించుకుని మాట్లాడాడు. కూతురి గొంతు వినగానే మరింత ఏడ్చేశాడు. అర్జున్ కూడా వాళ్ల నాన్న వీడియో మెసేజ్ వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యాడు. ఇక శ్రీసత్య అయితే తన తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు చిన్నపిల్లలా సంబరపడిపోయింది. అయితే వీళ్లందరిదీ ఒక రూటు.. గీతక్కది ఇంకో రూటు. ఆమెకి వాళ్ల నాన్న ఫోన్ చేశారు. హౌస్‌మేట్స్ని ఎలా మాట్లాడనివ్వదో వాళ్ల నాన్నని కూడా అలాగే మాట్లాడనివ్వలేదామె. నేనెలా ఆడుతున్నానో చెప్పు అంది. ఆయన చెప్తుంటే మధ్యలో అడ్డుపడిపోతోంది. నేనేమైనా మార్చుకోవాలా అని అడిగింది. ఆయన చెబుతుంటే అవన్నీ అయ్యే పని కాదులే వదిలెయ్ అంటోంది. నువ్వు కాస్త మారితే బాగుంటుంది అని ఆయన చెబుతున్నా ఏమాత్రం వినిపించుకోలేదు. తనకి కావలసిన ఆన్సర్లు వస్తే ఓకే అంది. ఆయన ఏదైనా రివర్స్లో చెబితే లైట్ తీసుకుంది. మొత్తానికి ఫోన్ కాల్‌ పేరుతో కూడా నానా హంగామా చేసింది. ఫోన్ కట్ అయ్యాక కూడా హౌస్‌ మేట్స్కి వినిపించాలని నాన్న లైన్‌లో ఉన్నట్టే గట్టిగట్టిగా మాట్లాడింది. ఆమె ఓవరాక్షన్‌ని హౌస్‌మేట్స్‌ ఎంత చూశారో తెలీదు కానీ.. ఆడియెన్స్కి మాత్రం బాగానే కనిపించింది. అందరితోనూ గొడవలు పడకుండా కాస్త కూల్‌గా మాట్లాడాలి, హౌస్‌మేట్స్తో ర్యాపో పెంచుకోవాలి, బిగ్‌బాస్ చెప్పిన మాట వినాలి లాంటి మంచి మాటలు చాలానే చెప్పారు నాన్న. కానీ గీతూ వాటిలో ఏదీ పాటించదని ఆమె మాట్లాడిన విధానాన్ని బట్టే అర్థమైపోయింది. 

మొత్తానికి ఇవాళ్టి ఎపిసోడ్ ఇలా గడిచింది. బ్యాటరీ రీచార్జ్ చేసుకునే ఆప్షన్ ఉందని నాకెందుకు చెప్పలేదు, ఉంటే నేను కూడా ఇంట్లోవాళ్లతో మాట్లాడుకునేవాడిని కదా అని శ్రీహాన్ ఫీలవుతున్నాడు. రేపు కూడా ఇదే టాస్క్ కంటిన్యూ కాబోతోంది కనుక అతనికేదైనా చాన్స్ దొరుకుతుందేమో చూడాలి. అయితే రేపు చాలా పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు బిగ్‌బాస్. చార్జింగ్ పెంచుకోవాలంటే వాసంతి, రోహిత్‌లలో ఒకరు రాబోయే రెండు వారాలకి సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి. ఇది అంత చిన్న విషయం కాదు. ఏమైనా జరగొచ్చు. ఓట్లు పడతాయనే నమ్మకంతో నామినేట్ చేసుకున్నాక సీన్ రివర్స్ అయ్యి ఎలిమినేట్ కూడా అయిపోవచ్చు. కాబట్టి దీనికి ఎవరు ఒప్పుకుంటారు? ఇద్దరిలో ఎవరు రిస్క్ తీసుకుని నామినేట్ అవుతారు? చూడాలి మరి.