
ఏదైనా పాయింట్ దొరికితే మామూలుగానే గంటలకు గంటలు డిస్కస్ చేస్తారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో రచ్చ జరిగాక మామూలుగా ఉంటారా? నిన్న జరిగిన విషయాలు, అందరూ చేసిన కామెంట్స్ గురించే చర్చలు స్టార్ట్ చేశారు హౌస్మేట్స్. ఇంతకీ ఎవరు ఎవరి గురించి ఏమన్నారు? ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఏమిచ్చారు? అందులో భాగంగా ఎవరు ఏం చేశారు?
పితూరీల పర్వం
నిన్నటి ఎపిసోడ్లో జరిగిన వాదోపవాదాల విషయంలో చర్చలు మొదలెట్టారు హౌస్మేట్స్. కీర్తి చేసిన కామెంట్స్ విషయంలో శ్రీసత్య ఫీలయ్యింది. గీతూ క్యారెక్టరే తనకి నచ్చదని, ఎదుటివాళ్లు ఫీలవుతారనే సెన్స్ కూడా లేకుండా మాట్లాడేస్తుందని కీర్తి కామెంట్ చేసింది. ఎలిమినేషన్ల విషయంలో రాజ్ తన మనసులోనే లేడని, కానీ అతను తనను కామెంట్ చేయడం వల్ల అప్పటికప్పుడు నామినేట్ చేశానని గీతూ చెప్పింది. ఆమె మాట్లాడే మాటలు ఏమాత్రం కరెక్ట్ కాదని, తన పద్ధతి తప్పు అని రాజ్ అన్నాడు. ఇక రేవంత్ అయితే ఎప్పటిలానే పంచాయతీలు పెట్టాడు. సుదీప నన్ను ఇలా అంది, మీరు చెప్పండి నా గురించి, మీకూ అలాగే అనిపిస్తోందా అంటూ చిన్నపిల్లాడిలా ప్రశ్నించాడు. ఎవరూ అడక్కుండానే తన గురించి తాను సంజాయిషీలు ఇచ్చేసుకున్నాడు. వాసంతిపై అతను ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్నాడంటూ గీతూ చేసిన కామెంట్ గురించి కూడా అర్జున్, శ్రీహాన్‌లతో చర్చించాడు. ఇక ఫైమా ఏమో సుదీప గురించి మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. మొత్తంగా చాలాసేపు అందరూ ఇలా ఒకరిపై ఒకరు పితూరీలు చెప్పుకోవడంతోనే సమయం గడిపారు.
ఎమోషనల్ టాస్క్
కెప్టెన్సీ టాస్కులో పాల్గొనడానికి కంటెండర్లని ఎంపిక చేసే సమయం వచ్చేసింది. అయితే ఈసారి ఫిజికల్‌గా కాక మెంటల్‌గా టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. హౌస్‌లో ఓ పెద్ద బ్యాటరీని పెట్టాడు. దానికి హండ్రెడ్ పర్సెంట్ చార్జింగ్ ఉంది. ఇంట్లో వాళ్లకి కొన్ని సర్ప్రైజ్లు రెడీగా ఉన్నాయని, సర్ప్రైజ్ యాక్సెప్ట్ చేసిన ప్రతిసారీ కొంత చార్జింగ్ తగ్గిపోతుందని చెప్పిన బిగ్‌బాస్.. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలవడం స్టార్ట్ చేశాడు. ముందుగా శ్రీహాన్‌ని రమ్మన్నాడు. ఇంట్లోవాళ్లు వండిన బిర్యానీ, నాన్నతో వీడియో కాల్, సిరితో ఆడియో కాల్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. అన్నిటికంటే తక్కువ పర్సంటేజ్ ఫుడ్‌కి పెట్టాడు. ఇక్కడ శ్రీహాన్ చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేశాడు. నాన్న, సిరి ఎంత ముఖ్యమైనా.. కాల్స్ తీసుకోవాల్సిన అవసరం మరికొంతమందికి తనకంటే ఎక్కువగా ఉందని, వాళ్ల కోసం తాను ఈ ఆప్షన్స్ వదిలేసుకుంటానని అన్నాడు. కానీ బిగ్‌బాస్ ఒప్పుకోలేదు. ఒకవేళ ఏ ఆప్షన్ తీసుకోకుండా టాస్కులో పాల్గొనడానికి నిరాకరిస్తే దాని పర్యవసానం హౌస్ మొత్తం మీద పడుతుందని హెచ్చరించాడు. దాంతో పదిహేను శాతం బ్యాటరీ మాత్రమే త్యాగం చేసి ఫుడ్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు శ్రీహాన్. ఆ తర్వాత సుదీపకి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. అయితే ఆమెకి ముప్ఫై, ముప్ఫై అయిదు, నలభై పర్సెంట్ పెట్టాడు బిగ్‌బాస్. ఆడియో కాల్ అన్నింటికంటే తక్కువ ఉండటంతో దాన్ని తీసుకుందామె. బైటికొచ్చి చాలా ఏడ్చింది. బిగ్‌బాస్ ఒప్పుకోకపోవడం వల్లే తాను ఆ ఆప్షన్ ఎంచుకున్నానని, అమ్మతో మాట్లాడటం కోసం ఆరాటపడుతున్న శ్రీసత్యకి చాన్స్ వస్తుందో లేదోనని ఫీలయ్యింది. అలా ఏమీ అనుకోవద్దని, తానేం ఫీలవ్వనని శ్రీసత్య ఆమెని ఓదార్చింది. తర్వాత తన భర్త కాల్ చేయడంలో సంతోషంలో మునిగిపోయింది సుదీప.
కాస్త ఎక్కువైంది గీతూ!
గీతూ చేసే పనులు కొన్ని క్యూట్‌గా ఉంటాయి. కానీ కొన్ని ఇరిటేట్ చేస్తుంటాయి. ఆమె ఫన్నీగా చేస్తున్నానని అనుకున్నా.. చూసేవారికి మాత్రం అవి కాస్త విసుగును పుట్టిస్తుంటాయి. శ్రీహాన్‌కి ఇంటి నుంచి బిర్యానీ వచ్చినప్పుడు ఆమె చేసిన యాక్షన్ కూడా అలానే అనిపించింది. బిర్యానీ వచ్చిందని తెలియగానే అతని కంటే ముందు స్టోర్ రూమ్‌లోకి దూరిపోయింది గీతూ. అక్కడి నుంచి క్షణక్షణం శ్రీహాన్‌నే ఫాలో అయ్యింది. అతనిని ఆ హ్యాపీనెస్‌ని ఫీలవ్వకుండా అడ్డుపడుతూ తెగ ఓవరాక్షన్ చేసింది. నేను నాన్‌వెజ్ తినను, కానీ అమ్మ చేసింది కదా తింటాను అంటూ ప్లేట్ పట్టుకుని తయారైపోయింది. తనని కాస్త ఎంజాయ్ చేయనివ్వు అని మిగతావాళ్లు చెప్పినా ఆమె పట్టించుకోలేదు. మన అమ్మ చేసిన బిర్యానీ, మన అమ్మ అంటూ చాలా మెలోడ్రామా చేసింది. అది కాస్త ఓవర్ బోర్డ్ అవడంతో చూడటానికి చిరాకేసింది. ఆమె అతిని చూసి కీర్తి, వాసంతి, శ్రీసత్యలు కూడా నవ్వుకున్నారు. ఇక సుదీపకి ఆడియో కాల్ వచ్చే విషయంలోనూ అవసరం లేని కామెంట్స్ చేసింది. అనవసరంగా ముందు వెళ్లానే అని శ్రీహాన్ ఫీలవుతుంటాడు అని పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడుతుంటే అలా అనొద్దు అంటూ ఎవరో ఆపారు. ప్రతిచోటా తన స్టైల్లో ఎలా పడితే అలా బిహేవ్ చేయడం, మాట్లాడటం అందరికీ రుచించదని ఈ గీతూ ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో!
ఆ ఇద్దరి తప్పుల ఫలితమేంటంటే..
నేను ఆట అదరగొడతా అని రేవంత్ పదే పదే చెప్పుకుంటూ ఉంటాడు. ఆట తనకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అన్నట్టుగా గీతూ బిల్డప్ ఇస్తూ ఉంటుంది. కానీ ఈ ఇద్దరూ చేసిన తప్పుల వల్ల ఇవాళ మొత్తం టాస్కుకే నష్టం ఏర్పడింది. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఒక్క తప్పు కూడా జరగకూడదంటూ అతి జాగ్రత్త పడుతున్నాడు రేవంత్. ఎవరైనా కన్ఫెషన్ రూమ్‌కి వెళ్తున్నా కూడా వాళ్లని అక్కడి వరకు తీసుకెళ్లి దిగబెడుతున్నాడు. అలాంటివాడు సోఫాలో పడుకుని చక్కగా నిద్రపోయాడు. కుక్కలు మొరగడంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఏమీ ఎరగనట్టు అమాయకంగా ముఖం పెట్టేశాడు. నిద్రపోయింది ఆదిరెడ్డినా అని అందరూ అడుగుతుంటే.. కాదు నా గురించే కుక్కలు మొరిగాయి, కానీ నేను నిద్రపోవట్లేదు ఆలోచిస్తున్నాను అంటూ కవరింగ్ ఇచ్చాడు. బిగ్‌బాస్‌కి తెలియదా అతనేం చేశాడో. అందుకే ఫైవ్ పర్సెంట్ చార్జింగ్ కోసి పారేశాడు. గతంలో కూడా అతను ఇలాగే నిద్రపోయి నేను నిద్రపోలేదంటూ తెగ వాదించాడు. బిగ్‌బాస్ దగ్గర ఆ పప్పులు ఉడుకుతాయా ఏంటి! ఇక ఆ తర్వాత గీతూని మైక్ సరిగ్గా వేసుకోమని చెప్పాడు బిగ్‌బాస్. వేసుకున్నాను కదా, ఇంకెక్కడ వేసుకోవాలి, మూతి మీద పెట్టుకోవాలా అంటూ వెటకారమాడింది గీతక్క. దాంతో మరో టెన్ పర్సంట్ కోత పెట్టాడు. మొత్తానికి ఈ ఇద్దరి తప్పుల వల్ల ఉత్తిపుణ్యాన ఫిఫ్టీన్ పర్సెంట్ చార్జింగ్ లాస్ అయ్యారు హౌస్మేట్స్.
ఆదిరెడ్డి ఆట, మాట తిప్పేశాడే!
కరెక్ట్‌గా ఆడతాను, పర్ఫెక్ట్ గా మాట్లాడతాను అని చెప్పే ఆదిరెడ్డి ఇవాళ తన స్వార్థం కోసం ఆటని, మాటని కూడా తిప్పేశాడు. శ్రీహాన్, సుదీపల తర్వాత ఆదిరెడ్డినే కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్. అప్పటికి బ్యాటరీ నలభై అయిదు శాతం ఉంది. మీ పాప ఉన్న టీషర్ట్కి ముప్ఫై, ఆడియో కాల్కి ముప్ఫై అయిదు, భార్యా పాపలతో వీడియో కాల్ మాట్లాడ్డానికి నలభై శాతం చార్జింగ్ త్యాగం చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. మిగతా వారిలా అందరి గురించీ ఆలోచించలేదు ఆదిరెడ్డి. తన ఎమోషన్స్ గురించే మాట్లాడాడు. ఎవరికైనా ఫ్యామిలీయే కదా ఇంపార్టెంట్, వీడియో కాల్ తీసుకుంటాను అని చెప్పాడు. దాంతో నలభై శాతం ఎగిరిపోయి ఫైవ్ పర్సెంట్ మాత్రమే చార్జింగ్ మిగిలింది. ఎక్కడ తనని స్వార్థపరుడని ఆడియెన్స్ అనుకుంటారోనని తెగ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ బిగ్‌బాస్ అతని మాటల్ని కట్ చేసేసి ఇక నువ్వెళ్లొచ్చు అని చెప్పేశాడు. బైటికొచ్చాక కూడా తెగ కవర్ చేసుకున్నాడు ఆది. తప్పనిసరై తీసుకున్నాను, ఎలాగూ ఫైవ్ పర్సెంటే డిఫరెన్స్ కదా అని వీడియో కాల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎంత చెప్పినా బిగ్‌బాస్ వినట్లేదు అంటూ బిల్డప్ ఇచ్చాడు. నిజానికి అతను బిగ్‌బాస్‌తో డిస్కస్ చేయనేలేదు. శ్రీహాన్, సుదీపల మాదిరిగా ఇంత పర్సెంటేజ్ పెడితే అందరికీ నష్టమే, తీసుకోను అని కూడా అనలేదు. కానీ అందరి దగ్గరా మాత్రం ఆయన ఒప్పుకోవడం లేదని అన్నాడు. పైగా ఫైవ్ పర్సెంటే ఉంది, నువ్వేం చేస్తావో చెయ్యి అని కెప్టెన్‌తో చెప్పడం కొసమెరుపు. ఇంత జరిగినా ఎవ్వరూ అతనిని ఒక్క మాట కూడా అనలేదు. తక్కువ ఉన్నది తీసుకోవచ్చు కదా అని క్వశ్చన్ కూడా చేయలేదు. పైగా అతని భార్య, పాప ఫోన్ చేసినప్పుడు అందరూ ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. అది అయ్యాక కూడా కాసేపు పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు ఆదిరెడ్డి. తన భార్య మాట్లాడిన విధానం సూపరని, తాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో తలచుకుంటే ఆశ్చర్యంగా ఉందని బిగ్‌బాస్‌తో మాట్లాడుతూ కెమెరాలకి తెగ ఫుటేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
మొత్తానికి ఇవాళ గేమ్ చాలావరకు ఎమోషనల్‌గా సాగింది. కాకపోతే బ్యాటరీలో ఐదు శాతమే మిగిలింది. రేపటి ఎపిసోడ్లో తిరిగి చార్జ్ చేసుకోడానికి అవకాశం ఇవ్వబోతున్నాడు బిగ్‌బాస్. ఫలితంగా హౌస్మేట్స్ పెద్ద పెద్ద త్యాగాలే చేయాల్సి ఉంటుంది. మరి అందుకు ఎవరు సిద్ధపడతారో, ఎవరు నో అని ఆటకి అడ్డుపడతారో చూడాల్సిందే.