బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్​కు రూ. 35 లక్షల క్యాష్, కారు

బిగ్ బాస్ విన్నర్  ప్రశాంత్​కు రూ. 35 లక్షల క్యాష్, కారు
  • సీజన్​-7 విజేతగా సిద్దిపేట వాసి పల్లవి ప్రశాంత్ 
  • పొలం పనులు చేసుకుంటూనే ఇన్​స్టా వీడియోలతో ఫేమస్ 
  • రన్నరప్​గా నిలిచిన అమర్​దీప్ 

హైదరాబాద్, వెలుగు: రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్–7’లోసిద్దిపేట జిల్లా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. వంద రోజులకుపైగా సాగిన ఆటలో అతడిని విజయం వరించింది. ఆదివారం గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ సీజన్–7 టైటిల్​ను పల్లవి ప్రశాంత్ దక్కించుకున్నాడని ప్రోగ్రాం హోస్ట్, హీరో నాగార్జున ప్రకటించారు.

అమర్ దీప్ రన్నరప్​గా నిలిచారని వెల్లడించారు. ఒక సాధారణ యూట్యూబర్, రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి. టైటిల్ కోసం ఫైనల్ లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ పోటీపడ్డారు. శివాజీ ఎలిమినేట్​ కావడంతో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ టైటిల్ పోరులో నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో ప్రశాంత్ గెలిచి సంచలనం సృష్టించాడు. ఒక సాధారణ రైతుబిడ్డగా హౌస్​లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్.. తన అద్భుతమైన ఆట తీరుతో విన్నర్​గా నిలవడంతో అతడి ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.  

బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్​కు ట్రోఫీతో పాటు రూ.35 లక్షల చెక్‌ను నాగార్జున అందజేశారు. మారుతీ సుజుకీ బ్రెజా ఎస్​యూవీ కీ కూడా ఇచ్చారు. జోస్ అలుక్కాస్ నుంచి డైమండ్ జువెలరీ కొనుగోలు కోసం రూ.15 లక్షల చెక్ కూడా ఆ సంస్థ ఎండీ అందజేశారు. 

నవ్వినోళ్లను పట్టించుకోకుండా..  

సిద్దిపేటకు చెందిన రైతు దంపతులు సత్యనారాయణ, విజయలక్ష్మి కొడుకు పల్లవి ప్రశాంత్. మొదట్లో టిక్ టాక్‌లో వీడియోలు చేసుకుంటూ ఉండేవాడు. టిక్ టాక్ బ్యాన్ అయ్యాక ఇన్​స్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో వీడియోలు తీయాలని అనుకున్నాడు. చిట్టీ డబ్బులతో మంచి ఫోన్ కొందామంటే ఫ్రెండ్ మోసం చేశాడు. దీంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ అతడికి తండ్రి ఐఫోన్ కొనివ్వడంతో ప్రశాంత్ కెరీర్ మారిపోయింది. పొలం పనులు చేసుకుంటూ.. వాటినే వీడియోలుగా పోస్ట్ చేయగా, లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. బిగ్ బాస్​లోకి ఎంట్రీ కోసం కూడా నానా ఇబ్బందులు పడ్డాడు. చివరకు ఎంట్రీ ఇవ్వడమే కాకుండా విజేతగా నిలిచాడు.