
బుల్లితెర రియాలిటీ షో అంటేనే రచ్చ, గొడవలు, డ్రామా, రొమాన్స్, అనుకోని మలుపులే గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మాత్రం ప్రారంభమైనప్పటి నుంచి కాస్త డల్‌గా, చప్ప చప్పగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హౌస్ లోని కొందరు కంటెస్టెంట్ల ఆట తీరు మరీ రొటీన్‌గా ఉంటోంది. మరికొందరు నామమాత్రంగా కనిపిస్తుండటంతో ప్రేక్షకులకు కావాల్సిన 'బిగ్ బాస్ మజా' దొరకడం లేదు. రియాలిటీ అంటే రచ్చ రచ్చగా, ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడే కదా.. బిగ్ బాస్ షోకు అందం.. అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ డల్‌నెస్ ఎక్కువ కాలం కొనసాగితే షోకే నష్టం కాబట్టి, బిగ్ బాస్ నిర్వాహకులు ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌ను అమాంతం పెంచాలని నిర్ణయించుకున్నారు.
'ఖతర్నాక్' వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్..
ఈ సారి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ తో ఏకంగా ఆరుగురు సభ్యులు అడుగుపెట్టనున్నారు. ఈ ఆరుగురు కొత్త సభ్యుల గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్‌ను 'బిగ్ బాస్ 2.O గ్రాండ్ లాంచ్' పేరుతో ఈ ఆదివారం అక్టోబర్ 13న ప్రసారం చేయనున్నారు. ఈ కొత్త ఎంట్రీలతో బిగ్ బాస్ 9కి కొత్త ఊపు రావడమే కాదు, ఇంట్లో అసలైన రణరంగం మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకుంటే ఈ కొత్త, పాత కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ, కాంట్రవర్సీలు మొదలయ్యే అవకాశం గట్టిగానే ఉంది.
ఆరుగురూ కాంట్రవర్సీ స్టార్సే..
ఈసారి బిగ్ బాస్ టీమ్ ఎంచుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు అందరూ తమ తమ రంగాల్లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వారే. వారిలో అయేషా జీనత్, దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్త, శ్రీనివాస్ సాయి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నారు.
వైల్డ్ కార్డ్స్‌లో అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయేషా జీనత్. ఈమె తమిళ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని 9 వారాలు ఉంది. అక్కడ తన ఫైరింగ్ పర్ఫార్మెన్స్‌తో వివాదాస్పదంగా నిలిచింది. ఏకంగా హోస్ట్ కమల్ హాసన్‌పైనే ఎదురుతిరిగి అయేషా హాట్ టాపిక్ అయ్యింది. బిగ్ బాస్ ఫార్మాట్‌పై పూర్తి అవగాహన ఉండటం, ఆవేశపూరిత స్వభావం ఉండటంతో తెలుగు హౌస్‌లో ఈమె వైల్డ్ ఫైర్ చూపించడం గ్యారంటీ. తెలుగులో 'సావిత్రమ్మ గారి అబ్బాయి' సీరియల్‌తో పాటు పలు షోల్లో కనిపించింది.
ఇక దివ్వెల మాధురి. ఈమె పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో పెద్ద రచ్చకు దారి తీసింది. ఆమె చేసే పోస్టులు ఇట్టే వైరల్ గా మారిపోతుంటాయి. ఇలాంటి సెన్సేషనల్ ఇమేజ్ ఉన్న మాధురి హౌస్‌లోకి వస్తే, డ్రామా పీక్స్‌కు వెళ్లడం ఖాయం అంటున్నారు అభిమానులు.
అలేఖ్య చిట్టి పికిల్స్ గా పేరు తెచ్చుకున్న రమ్య మోక్ష కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. సోషల్ మీడియాలో బోల్డ్ కామెంట్స్, ఛాలెంజింగ్ వీడియోలతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న అలేఖ్య చిట్టి... రమ్య మోక్షగా ఫేమస్ అయ్యింది. ఆమె పేరు కాంట్రవర్సీలకు దారితీసినా, హౌస్‌లో ఆమె ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ గట్టిగా ఉంటుందని మేకర్స్ నమ్ముతున్నారు.
నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్త, శ్రీనివాస్ సాయిలు కూడా వెండితెరపై, బుల్లితెరపై తమదైన ముద్ర వేసుకున్నవారే. వీరిలో నిఖిల్ నాయర్ బుల్లితెరపై మంచి పేరుంది. కొత్త ఎంట్రీల ఉద్దేశమే కాంట్రవర్సీ కాబట్టి, వీరిలో కూడా బిగ్ బాస్ రచ్చకు కావాల్సినంత స్పైస్ ఉందనేది నిర్వాహకుల అంచనా వేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే హౌస్‌లో పవన్, కళ్యాణ్ పడాల లాంటి కంటెస్టెంట్‌లతో పాటు మరికొందరి ప్రవర్తన విమర్శలకు గురవుతోంది. ఇలాంటి సమయంలో ఈ ఆరుగురు కాంట్రవర్సీ స్టార్స్ ఎంట్రీతో బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో అసలైన సునామీ మొదలవుతుందా? లేదా? అనేది చూడాలి మరి.