Bigg Boss Telugu 9: బాండింగ్స్‌పై కాదు, ఆట మీద దృష్టి పెట్టండి.. హౌస్‌మేట్స్‌కి నాగార్జున 'మాస్' వార్నింగ్!

Bigg Boss Telugu 9: బాండింగ్స్‌పై కాదు, ఆట మీద దృష్టి పెట్టండి.. హౌస్‌మేట్స్‌కి నాగార్జున 'మాస్' వార్నింగ్!

బుల్లితెర రియాలిటీ షో  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7, 2025న అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పోటీ పడుతున్నారు. ఈ షోకు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తొలి వారం నుంచే నాటకీయ పరిణామాలు, టాస్క్‌లతో హౌస్ హీటెక్కింది. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా హౌస్‌మేట్స్ ఆటతీరుపై నాగార్జున గట్టిగా నిలదీయబోతున్నారని శనివారం ఎపిసోడ్ ప్రోమో స్పష్టం చేసింది.

మాస్ లుక్‌లో కింగ్ ఎంట్రీ

ఈ వారం నాగార్జున ఎంట్రీ అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. 60 ఏళ్ల వయసులో కూడా తన స్టైల్, ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తూ.. మరో సారి మాస్ సినిమా పాటని రీక్రియేట్ చేస్తూ అదే లుక్‌లో అడుగుపెట్టారు. నాగార్జున మాస్ ఎంట్రీ చూసి హౌస్‌మేట్స్ ఉల్లాసంతో చిందులేశారు. ముఖ్యంగా కంటెస్టెంట్ భరణి మాస్ ఈజ్ బ్యాక్.. మమమాస్ అంటూ గట్టిగా అరిచి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

తనూజకు నాగార్జున క్లాస్

వారమంతా ఆటలో కంటెస్టెంట్లు చేసిన తప్పులపై నాగార్జున తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. గత వారం మాదిరిగానే స్టార్లతో వారి పనితీరును అంచనా వేసిన తర్వాత, కంటెస్టెంట్లను వ్యక్తిగతంగా నిలదీశారు. ఈ వారం క్లాస్‌లో ప్రధానంగా బాండింగ్స్‌కి ఇచ్చిన ప్రాధాన్యత, ఆటపై చూపిన నిర్లక్ష్యం చర్చనీయాంశమైంది. ముందుగా నటి తనూజని పిలిచి బెడ్ టాస్క్‌లో ఆమె వ్యవహరించిన తీరుపై నాగార్జున ప్రశ్నలు సంధించారు. ఆడపిల్లలందర్నీ తోసేద్దాం అని వాళ్లు అన్నప్పుడు, నువ్వు వారందరి తరపున పోరాడి ఉంటే చివరికి నీ వరకూ వచ్చేది కాదు కదా?  బాండింగ్ పై ఫోకస్ పెట్టి.. ఆటను నిర్లక్ష్యం చేస్తావా అని సూటిగా ప్రశ్నించారు. దీంతో తనూజను ఆలోచనలో పడింది. మీరంతా కలిసి ఆడండి, విడివిడిగా ఆడొద్దు అని పదే పదే చెప్తున్నా, నీకు బుద్ధి రాలేదా? భరణి, ఇమ్మానుయేల్, కల్యాణ్... ఈ ముగ్గురూ నిన్ను తీయరని అనుకున్నావా?  అని నాగార్జున సీరియస్ అయ్యారు.

 ఫ్రెండ్‌షిప్ vs ఫెయిర్‌నెస్..

అనంతరం దివ్య నిఖిత వాయింపు మొదలైంది. నీ విషయంలో చాలా డెలిగేట్‌గా బిహేవ్ చేసిన భరణి, తనూజతో మాట్లాడుతున్న శ్రీజను అలా లాగేయడం న్యాయమేనా? అని నాగ్ ప్రశ్నించగా, దివ్య తెలివిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎవరి బాండ్‌ని బట్టి వాళ్లు అలా చేస్తున్నారు కదా సార్ అని దివ్య అనగా.. నాగార్జున అంటే ఆయనకి తనూజ ఉంటే ఓకేనా? అని కౌంటర్ ఇచ్చారు. దీనికి దివ్య అవును సార్ అని క్లారిటీ ఇచ్చింది. దీనికి  వెంటనే నాగార్జున ఒకవేళ దివ్య, తనూజ ఉంటే ఏం చేసేవారు భరణి? అని ప్రశ్నించారు. ఖచ్చితంగా తనూజకే సపోర్ట్ చేస్తారు.. ఎందుకంటే నేను అర్థం చేసుకుంటానని ఆయనకి తెలుసు అని దివ్య చెప్పింది. దానికి నాగార్జున అంటే తనూజ అర్థం చేసుకోదా? అని ప్రశ్నిస్తూ పుల్ల పెట్టడం ప్రేక్షకులకు కావాల్సినంత మసాలా అందించింది.

ఫ్లోరాను నిలదీసిన నాగ్..

నటి ఫ్లోరా సైనీ వంతు వచ్చినప్పుడు, హౌస్‌లో ప్రచారంలో ఉన్న ప్రేమ జంట ఢమాల్ పవన్ (డిమాన్ పవన్), రీతూ చౌదరిల గురించి నాగార్జున ప్రస్తావించారు. ఢమాల్ ఉంటే రీతూ కోసం అందర్నీ తోసేస్తాడినే స్ట్రాటజీతోనే అతన్ని ముందే తప్పించావ్ కదా?  అని ఫ్లోరాను నిలదీశారు.

భరణికి ఆడియన్స్ షాక్

ఈ వారం ఎపిసోడ్‌లో అత్యంత ముఖ్యమైన మలుపు భరణి శంకర్ ఎపిసోడ్. నాగార్జున ఎంతో ఎదగాల్సిన నువ్వు పడింది బెడ్‌పై నుంచి కాదు... మా దృష్టిలో నుంచి కూడా కిందపడ్డావ్. వారంలో తప్పులు చేసి వీకెండ్‌లో ఒప్పుకుంటే కుదరదు అంటూ భరణికి గట్టిగా క్లాస్ పీకారు. అంతేకాదు, ప్రేక్షకుల్లో ఒకరితో మాట్లాడించి.. భరణి ఆట ఎలా ఉందో స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు. ఒక లేడీ ఫ్యాన్.. ఏకంగాభరణి గారూ... మీకు బాండింగ్స్ తప్ప ఆట కనిపించడం లేదు... మిమ్మల్ని అసలు బిగ్ బాస్‌లో ఉంచబుద్ధి కావడం లేదు" అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో, భరణి షాక్‌కి గురయ్యాడు.

మొత్తానికి, ఈ శనివారం ఎపిసోడ్ హౌస్‌మేట్స్‌కు ఒక మేలుకొలుపులా, ప్రేక్షకులకు పండుగలా ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. మరి నాగార్జున క్లాస్ తర్వాత కంటెస్టెంట్ల ఆటలో ఏమైనా మార్పు వస్తుందో చూడాలి...