బిహార్ ఎన్నికల్లో వరల్డ్ బ్యాంక్ నిధులు వాడారు..రూ.14 వేల కోట్లను దారి మళ్లించారు: జన్ సురాజ్ పార్టీ సంచలన ఆరోపణ

బిహార్ ఎన్నికల్లో వరల్డ్ బ్యాంక్ నిధులు వాడారు..రూ.14 వేల కోట్లను దారి మళ్లించారు: జన్ సురాజ్ పార్టీ సంచలన ఆరోపణ
  • డైవర్ట్  చేసిన ఫండ్స్​తో మహిళలకు రూ.10 వేల చొప్పున పంచారు
  • డబ్బులు పంచకపోయుంటే ఎన్డీయే ఘోరంగా ఓడిపోయేదని కామెంట్

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రపంచ బ్యాంకు నిధులు రూ.14 వేల కోట్లను నితీశ్ కుమార్ సర్కారు దారి మళ్లించిందని జన్  సురాజ్ పార్టీ (జేఎస్పీ) సంచలన ఆరోపణ చేసింది. ఈ నిధులతోనే ఓటర్లకు ఉచితాలు ఇచ్చారని జేఎస్పీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్  ఆరోపించారు. ఆదివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. జూన్ నుంచి ఎన్నికల షెడ్యూల్  ప్రకటించే వరకూ నితీశ్  సర్కారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని, అందులో రూ.14 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతోనే ప్రజల ఓట్లు కొన్నారని విమర్శించారు. 

‘‘సరిగ్గా ఎన్నికలకు ముందు సీఎం మహిళా రోజ్ గార్  యోజన కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున బదిలీ చేశారు. ఓటింగ్ కు ముందురోజు వరకూ మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతూనే ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా యథేచ్చగా ఉల్లంఘించారు. మహిళల బ్యాంక్ అకౌంట్లలో రూ.10 వేలు జమచేసి వారి ఓట్లు కొన్నారు. డబ్బులు పంచకపోయుంటే ఎన్డీయే కూటమి ఘోరంగా ఓడిపోయేది” అని ఉదయ్ సింగ్ వ్యాఖ్యానించారు. 

తాము అధికారంలోకి వస్తే, వృద్ధులకు రూ.2 వేలు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చామని, దీంతో నితీశ్ ప్రభుత్వం అప్పటిదాకా ఇచ్చిన రూ.700 వృద్ధాప్య పింఛన్ ను రూ.1100కు పెంచిందని ఆయన గుర్తుచేశారు. ఇది కూడా కోడ్ ఉల్లంఘిన కిందకే వస్తుందన్నారు. ఇక, ఆర్జేడీ గెలిస్తే, రాష్ట్రంలో మళ్లీ జంగిల్ రాజ్ పాలన వస్తుందన్న భయంతో చాలామంది తమ పార్టీ నేతలు ఎన్డీయేలోకి వెళ్లారని సింగ్  తెలిపారు. జేఎస్పీ మరో నేత పవన్  కుమార్  కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం కేటాయించిన ప్రపంచ బ్యాంకు రుణాల్లో రూ.21 వేల కోట్లను దారిమళ్లించి మహిళలకు పంచారని ఆయన పేర్కొన్నారు.