యూపీలో ఘోరం: కూలిన క్వారీలో చిక్కుకున్న కార్మికులు.. ఒకరు మృతి

యూపీలో ఘోరం: కూలిన క్వారీలో చిక్కుకున్న కార్మికులు.. ఒకరు మృతి
  • పదిమందికి పైగా గల్లంతు

సోన్​భద్ర: ఉత్తరప్రదేశ్​లోని సోన్​భద్రలో ఘోర ప్రమాదం జరిగింది. బిల్లి మార్కుండి ఏరియాలో స్టోన్ క్వారీ కూలిపోయి ఒకరు చనిపోయారు. పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శనివారం సాయంత్రం కృష్ణా మైనింగ్  వర్స్స్  స్టోన్  క్వారీలో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యకలాపాలు చేపట్టాయి. చనిపోయిన కార్మికుడి మృతదేహాన్ని ఆదివారం ఉదయం వెలికితీశారు. రాళ్లు పెద్దగా ఉండడంతో శకలాలను తొలగించడం కష్టంగా మారిందని, అయినప్పటికీ అతికష్టం మీద శిథిలాలను క్లియర్  చేస్తున్నామని అధికారులు తెలిపారు. 

క్వారీ కూలిపోయిన టైంలో కనీసం 12 మంది కార్మికులు పనిచేస్తుండవచ్చని వారణాసి జోన్  అదనపు డీజీపీ పీయూష్  మోర్దియా తెలిపారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. చనిపోయిన కార్మికుడిని రాజు సింగ్(30) గా గుర్తించామని చెప్పారు. రాళ్లు భారీగా ఉండడంతో శకలాలను క్లియర్  చేయడానికి టైం పడుతుందన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 

ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సంజీవ్  కుమార్  గోండ్  ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా.. గనిలో చిక్కుకున్న కార్మికుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కృష్ణా మైనింగ్ వర్క్స్  ఓనర్, అతని  పార్ట్ నర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.