- రామోజీపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రశంస
- రామోజీ ఎక్స్‌లెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు
- పాల్గొన్న సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు,
హైదరాబద్, వెలుగు: రామోజీరావు ఓ కుగ్రామం నుంచి వచ్చి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్‌లెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. సిబ్బందిలో రామోజీరావు బృంద స్ఫూర్తిని నింపేవారన్నారు.
ఆలోచనలను సంస్థలుగా తీర్చిదిద్దిన వ్యక్తి రామోజీరావు అని కొనిడాయారు. దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా స్పందించేవారని, ఆయన సాయం చేస్తూ ప్రజలనూ భాగస్వాములను చేసేవారని గుర్తుచేశారు. సమాజానికి స్ఫూర్తిగా నిలవడమే ఓ గొప్ప విజయమని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రామోజీరావు సంస్థలు తెలంగాణకు గర్వకారణంగా నిలిచాయని పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ రెండు వేల ఎకరాల కళాఖండమని, తెలంగాణకు ఫోర్త్ వండర్‌గా ఆర్‌ఎఫ్‌సీ నిలిచిందని కొనియాడారు. ఆర్‌ఎఫ్‌సీని ఇబ్బంది పెట్టాలని కొందరు గతంలో ప్రయత్నించారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
