అమిత్‌ షా వ్యాఖ్యలకు నితీశ్‌ కౌంటర్‌

అమిత్‌ షా వ్యాఖ్యలకు నితీశ్‌ కౌంటర్‌

జేడీయూ అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. చరిత్రను ఎవరైనా మార్చగలరా..? అని ప్రశ్నించారు. ‘చరిత్రను మారుస్తారా ? దానిని ఎవరు ఎలా మార్చుతారో అన్నది అర్థం కావడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చరిత్రకారులను ఉద్దేశించి అమిత్‌ షా మాట్లాడారు. దేశంలో చాలా సామ్రాజ్యాలు శతాబ్దాలుగా పరిపాలించినప్పటికీ మొఘల్‌ పరిపాలనకే చరిత్రకారులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అమిత్ షా ఆరోపించారు. ‘నేను చరిత్రకారులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకు చాలా సామ్రాజ్యాలు ఉన్నాయి. కానీ, చరిత్రకారులు మొఘలులపై మాత్రమే దృష్టి పెట్టారు. వారి గురించే ఎక్కువగా రాశారు’ అని అన్నారు. గత వైభవాన్ని వర్తమానానికి పునరుజ్జీవింపజేయాలని దేశంలోని చరిత్రకారులకు విజ్ఞప్తి చేశారు. దేశ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇది దోహదపడుతుందని అమిత్ షా అన్నారు.

అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని సీఎం నితీశ్‌ కుమార్‌ను మీడియా ప్రతినిధులు అడిగారు. దీంతో ఆయన తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. ‘చరిత్ర అంటే ఏమిటి, ఎవరైనా దానిని ఎలా మార్చగలరు..?’ అని ప్రశ్నించారు. చరిత్ర అంటే చరిత్రే అని అన్నారు. ‘భాష అనేది వేరే సమస్య. కానీ మీరు ప్రాథమిక చరిత్రను మార్చలేరు’ అంటూ అమిత్‌ షా వ్యాఖ్యలను నితీశ్ కుమార్ ఎద్దేవా చేశారు. బీహార్ లో ప్రస్తుతం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నితీశ్ కుమార్ నడుపుతున్న సంగతి తెలిసిందే.