బల పరీక్షలో నితీశ్​ సర్కారు పాస్​

బల పరీక్షలో  నితీశ్​ సర్కారు పాస్​

పాట్నా: బిహార్​ సీఎం, జేడీయూ చీఫ్‌ నితీశ్ కుమార్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన బల పరీక్షలో 129 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిచ్చారు. బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులుండగా..బలపరీక్షలో నెగ్గాలంటే 122 మెజార్టీ మార్క్​ను అందుకోవాలి. నితీశ్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 129 ఓట్లు వచ్చాయి. దీంతో నితీశ్ సర్కార్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.  

విశ్వాస పరీక్షలో నితీశ్ సర్కార్ గెలవడంతో  'మహాఘట్​ బంధన్' కూటమికి చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్  ఫ్రంట్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం నితీశ్ మాట్లాడుతూ.." రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆర్జేడీ ప్రభుత్వం(2005 కి ముందు)లో అవినీతికి పాల్పడింది. వాళ్ల హయాంలో బిహార్​‌లో అనేక మతపరమైన అల్లర్లు జరిగాయి. ఎక్కడా లా అండ్ ఆర్డర్ అమలు కాలేదు. దీనిపై ఎన్డీఏ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం విచారిస్తుంది" అని చెప్పారు. కాగా, నితీశ్ కుమార్​ 'మహాఘట్​ బంధన్' నుంచి వైదొలిగి ఎన్డీఏలో ఎందుకు చేరారో తెలియదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు.