రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలె

రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలె

తెలంగాణ సీఎం కేసీఆర్పై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. కష్టపడి తెలంగాణ సాధించిన వ్యక్తిని ప్రజలు ఎప్పటికీ వదులుకోరని అన్నారు. ఎవరేం మాట్లాడినా పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్కు సూచించారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను కొందరు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తాము చేయని పనులు కూడా చేసినట్లు కొందరు ప్రచారం చేసుకుంటారని పరోక్షంగా కేంద్రాన్ని విమర్శించారు. 

బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలా కాలం నుంచి అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా లభించి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందేదని అన్నారు. గాల్వాన్ అమర వీరులు, సికింద్రాబాద్ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేయడాన్ని నితీశ్ అభినందించారు. తెలంగాణలో చాలా మంది బీహార్ కార్మికులు పని చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ తరహాలోనే ఇతర రాష్ట్రాలు కూడా అమరుల కుటుంబాలకు అండగా ఉండాలని నితీశ్ పిలుపునిచ్చారు. 

మరోవైపు సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. బీహార్ కు కేంద్రం నుంచి రావాల్సిన సాయం రాకపోగా.. మరింత భారం పడుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు ఒకదానికొకటి సాయం చేసుకోవాలని తేజస్వీ అభిప్రాయపడ్డారు. సమాజంలో వ్యాప్తి చెందుతున్న ద్వేషాన్ని తగ్గించడం పెను సవాల్ గా మారిందని అన్నారు.