గవర్నర్‌కు నితీష్‌కుమార్‌ రాజీనామా లేఖ.. సాయంత్రం సీఎంగా మళ్లీ ప్రమాణం

గవర్నర్‌కు నితీష్‌కుమార్‌ రాజీనామా లేఖ.. సాయంత్రం సీఎంగా మళ్లీ ప్రమాణం

జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్..​ సీఎం పదవికి రాజీనామా చేశారు. జనవరి 28వ తేదీ ఆదివారం ఉదయం తాను.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం తన రాజీనామా లేఖను  గవర్నర్‌కు సమర్పించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బీహార్‌ సీఎంగా మళ్లీ నితీష్‌ ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు నితీశ్​కు మద్దతుగా లేఖలను అందజేసినట్టు సమాచారం. ఈక్రమంలో ఆదివారం పాట్నాలో బీజేపీఎల్పీ సమావేశమైంది.  ఈ సమావేశం అనంతరం బీజేపీ.. జేడీయూకు మద్దతు తెలుపనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత జేడీయూ, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ వద్దకు నితీష్​ వెళ్తారని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. దీంతో బిహార్ లో మళ్లీ రాజకీయ అలజడి మొదలైంది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని అధికార కూటమిలో విభేదాలు తలెత్తడంతో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఈక్రమంలో కాంగ్రెస్ కూటమికి గుడ్ బై చెప్పిన నితీశ్ కుమార్.. మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. బీజేపీ అండతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధమయ్యారు.