విపక్షాలు ఏకమైతే 2024లో విభిన్న ఫలితాలు

విపక్షాలు ఏకమైతే 2024లో విభిన్న ఫలితాలు

2024లో ప్రతిపక్షాలు ఏకమైతే దేశంలో విభిన్న ఫలితాలు వస్తాయని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. మ‌ణిపూర్‌లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేర‌డంపై స్పందించిన నితీష్ కుమార్..ప్రతిపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేల‌ను బీజేపీ చేర్చుకుంటోందని, ఇది రాజ్యాంగ‌ బద్ధమైన‌దేనా అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆరోపించారు. 

మాతోనే ఉంటామని హామీ ఇచ్చారు..
బీహార్లో తాము ఎన్డీఏ నుంచి విడిపోయినప్పుడు మణిపూర్కు చెందిన ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు తమను కలిశారని సీఎం నితీష్ కుమార్ చెప్పారు. పార్టీతోనే క‌లిసి ప్రయాణిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదని...ఐదుగురు బీజేపీలో చేరిపోయారని తెలిపారు. 

నితీష్ కుమార్కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు..!
ఈ నెల 2వ తేదీన బీహార్ సీఎం నితీష్ కుమార్కు పెద్ద షాక్ ఇస్తూ.. మణిపూర్ నుండి ఐదుగురు జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేలు అధికార బిజెపిలో చేరారు. మణిపూర్లో జేడీయూకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా..అందులో ఐదుగురు జేడీయూకి రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. అంతేకాదు మూడింట రెండింతల మంది పార్టీ నుంచి బయటికి రావడంతో తమను బీజేఎల్పీలో కలపాలని స్పీకర్కు జేడీయూ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారు. దీంతో జేడీయూ ఎమ్మెల్యేల విలీనానికి స్పీకర్ ఓకే చెప్పారు. ఇక ఆగ‌స్ట్ 25న అరుణాచ‌ల్ ప్రదేశ్‌కు చెందిన జేడీ(యూ) ఏకైక ఎమ్మెల్యే టెకి క‌సో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు.

మణిపూర్లో జేడియూ అడ్రస్ గల్లంతు..
మణిపూర్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2022 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలవగా..ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలుపొందారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ ఐదు, నేషనల్ పీపుల్స్ పార్టీ 7 సీట్లు గెలిచింది. 38 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జేడీయూ ఏడు సీట్లలో విజయం సాధించింది. తాజాగా ఈ ఏడుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు బీజేపీలో చేరడంతో..మణిపూర్లో జేడియూ అడ్రస్ గల్లతైంది. మరోవైపు అసెంబ్లీలో బీజేపీ బలం 32 నుంచి 37కు పెరిగింది.