అవినీతి అధికారులను పట్టిస్తే రూ.50 వేల బహుమతి

అవినీతి అధికారులను పట్టిస్తే రూ.50 వేల బహుమతి

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలను నిరోధించేందుకు బీహార్ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లంచం అడిగిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై ఫిర్యాదు చేసిన ప్రజలకు వెయ్యి రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు నగదును బహుమతిగా ఇవ్వనున్నట్లు సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. దీనికి సంబంధించి బీహార్ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. లంచగొండి అధికారులు, ఉద్యోగులను పట్టిచ్చిన వారికి నగదు బహుమతులు ఇచ్చేందుకు వీలుగా తాము ప్రైజ్ ఫండ్ ను ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. అవినీతి అధికారిని పట్టిచ్చిన వారికి నగదు బహుమతి ఇవ్వడంతోపాటు వారు కోర్టుకు హాజరయ్యేందుకు వీలుగా భోజనం, రవాణ ఖర్చుల కింద రోజుకు 200 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం తెలిపారు. లంచగొండుల సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.