"ఖాకీ ది బిహార్ చాప్టర్" అనే వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన బిహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధాపై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు నిజమని భావిస్తూ కేసు నమోదు చేయడంతో పాటు, ఆయన్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఆర్థిక లాభాల కోసం తన పదవిని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో డిసెంబర్ 7న ఐపీసీ సెక్షన్లు 120 బి, 168 కింద స్పెషల్ విజిలెన్స్ యూనిట్ కేసులు నమోదు చేసింది. కాగా ఈ విషయంపై తదుపరి విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి నిర్వహించనున్నట్టు సమాచారం.
బిహార్ ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ లోధా జీవితం ఆధారంగా, తాను స్వయంగా రాసుకున్న బిహార్ డైరీస్ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఖాకీ చి బిహార్ చాప్టర్. అవినీతి, అక్రమాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తారని పేరు తెచ్చుకున్న అమిత్ లోధా.. తన ఉద్యోగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. తన పుస్తకాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో అమిత్ కోటి రూపాలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అమిత్ భార్య బ్యాంకు ఖాతాకు రూ. 49 లక్షలు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. సిరీస్ ఒప్పందానికి ముందే ఖాతాలో నగదు జమైందన్న ఆరోపణలు నిజమని తేలడంతో అమిత్ లోధాను సస్పెండ్ చేశారు.
