తెలుగు రాష్ట్రాల్లో గోదావరి అందాలు చూడాలంటే పాపికొండల విహార యాత్ర చేయాల్సిందే.. తెలంగాణలోని భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి వరకు విహారయాత్రను పర్యాటక శాఖ ఆధ్వర్వంలో జరుగుతుంది. అయితే ఇప్పుడు అంటే జూన్ 14 నుంచి పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
భద్రాచలం సీతారామస్వామిని దర్శించుకున్న తరువాత చాలామంది జనాలు పాపికొండల విహారయాత్రకు బోట్‌షికార్ చేస్తారు. గోదావరి నదిలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ టూర్‌ను తాత్కాలికంగా ఆపేసినట్లు రంపచోడవరం ఆర్డీవో స్వాతి తెలిపారు.
పాపికొండల టూరెస్ట్ బోట్లలో ఇటీవలి కాలంలో ఎక్కువుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పర్యాటక బోట్ల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు జూన్ 14 నుంచి పరిశీలన పూర్తయ్యే వరకు పాపికొండల టూర్ ను ఆపేశారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన ఒక ప్రభుత్వ బోటుతో పాటు, ప్రైవేటు రంగానికి చెందిన మరో 15 పర్యాటక బోట్లు గోదావరి తీరంలో పాపికొండల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఉపయోగిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా తరలివచ్చే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా యంత్రాంగం ఈ చర్యలు చేపట్టింది.భద్రతా తనిఖీలు ముగిశాక యథావిధిగా బోట్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు
