రోడ్లపై గుంతలా.. ? గుంతల్లో రోడ్డా.. ?

రోడ్లపై గుంతలా.. ? గుంతల్లో రోడ్డా.. ?

దేశంలో ఇప్పటివరకూ ఎన్నో గుంతలు పడిన రోడ్లను చూసి ఉంటాం. ఎంతో అధ్వాన్నంగా మారిన, ప్రయాణికులను ఇబ్బందులు పెట్టే రహదారులనూ చూసి ఉంటాం. కానీ ఎప్పుడైనా ఖాళీ లేకుండా ఉన్న గుంతల వరుసను కలిగి ఉన్న రోడ్డును చూశారా చూడకపోతే ఓ సారి బిహార్ వైపు ఓ లుక్కేయండి. ఆ రాష్ట్రంలో మధుబని గుండా వెళ్లే 227 జాతీయ రహదారి పరిస్థితి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవేమో. అడుగు అడుగుకో గుంత... అసలు చూడడానికే ఇంత దారుణంగా ఉంటే.. ఇక అక్కడి ప్రజలు 2015నుంచి ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అంటే వారి పరిస్థితి ఇంకెంత దుర్భరంగా ఉంటుందో కదా. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ రహదారిని ఆనుకొని దాదాపు 15000 కుటుంబాలు జీవనం సాగిస్తుండగా... 500 వరకు చిన్న చిన్న దుకాణాలు కూడా ఈ రోడ్డుపైనే ఉన్నాయి.

ఈ రహదారిని చూపిస్తూ ఈ రోడ్లు అచ్చం "తకేషీ క్యాస్టిల్" అనే గేమ్ షోను తలపించే విధంగా ఉన్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైరికల్ గా కామెంట్ చేస్తున్నారు. అయితే తరచూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమర్శలకు దిగే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన ఆయన... ఇది 90వ దశకంలోని బిహార్‌లోని జంగిల్ రాజ్‌ రోడ్ల పరిస్థితిని గుర్తుచేస్తుందని కామెంట్ చేశారు. అయితే నితీశ్ కుమార్ మాత్రం రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయంటూ ఇటీవలే చెప్పారని.. దానికి నిదర్శనమే ఈ రోడ్లంటూ పీకే ట్వీట్ చేశారు. ఆదర్శవంతమైన ఈ రోడ్లని ప్రజలు.. నితీష్ కు చూపాలని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా కామెంట్ చేశారు. 

తాజాగా ఈ భయంకరమైన పరిస్థితిని దైనిక్ భాస్కర్ వార్తాపత్రికకు చెందిన ప్రవీణ్ ఠాకూర్ అనే వ్యక్తి ఏరియల్ వ్యూ ద్వారా చిత్రీకరించి పోస్టే చేసేసరికి.. ఈ అంశం తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ రోడ్డు మరమ్మతులు చేసేందుకు ఇప్పటికి మూడుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ... కాంట్రాక్టర్లు మాత్రం అసంపూర్తిగా పనులు చేసి, చేతులు దులుపుకున్నారు. 2024 డిసెంబర్ నాటికి బిహార్‌లోని రోడ్లను అమెరికా(యునైటెడ్ స్టేట్స్‌)రోడ్లతో సమానంగా తీర్చిదిద్దుతామని ఇటీవల కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ సారైనా ఈ రోడ్డుకు దశ మారుతుందా, లేదా అని ఆ రోజు కోసం అక్కడి ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.