కరీంనగర్, వెలుగు: బిహార్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో కోర్టులో హాజరుపరిచేందుకు కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ ను తమకు అప్పగించాలని బిహార్ పోలీసులు కరీంనగర్ జైలు అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. సుబోధ్ సింగ్‌పై బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో దోపిడీ కేసులు నమోదయ్యాయి. పాత కేసుల విచారణ కోసం ఆయా రాష్ట్రాల పోలీసులు కరీంనగర్ జైలు అధికారులకు లేఖలు రాసినట్లు సమాచారం. అయితే కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసు విచారణ ఇంకా పూర్తి కాకపోవడంతో సుబోధ్ సింగ్‌ను ఇతర రాష్ట్రాల పోలీసులకు అప్పగించేందుకు నిరాకరించినట్లు తెలిసింది.
మరో ఆరు రోజుల కస్టడీకి నిందితులు..
పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు నిందితులు సుబోధ్ సింగ్, రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరాసింగ్, రవీష్ కుమార్‌లను పోలీసులు ఈ నెల 3 నుంచి 7 వరకు కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వారిని వెంటబెట్టుకుని వెళ్లి కరీంనగర్ జిల్లా వెలిచాల బైపాస్ రోడ్డు వద్ద చెట్ల పొదల్లో దాచిన రెండు తుపాకులను, జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామ అటవీ ప్రాంతంలో దాచిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అంతేగాక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. అయితే దోచుకెళ్లిన బంగారం ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో కేసును మరింత లోతుగా విచారించేందుకు ఐదుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేయగా, కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు బుధవారం వారిని మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
