1990 నుంచి బిహార్‌లో పరిస్థితులు ఏం మారలె

1990 నుంచి బిహార్‌లో పరిస్థితులు ఏం మారలె

బీహార్ ను పాలించిన అన్ని రాజకీయ పార్టీలపైనా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విరుచుకుపడ్డారు. 1990 నుంచి రాష్ట్రంలో పరిస్థితులేం మారలేదని ఆరోపించారు. గాంధీ జయంతి రోజున పశ్చిమ చంపారన్ నుంచి 3,500 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించిన ఆయన... విద్య, వైద్య సేవలు మెరుగుపడతాయని 30- 40 ఏళ్లుగా వింటున్నాం కానీ రాష్ట్రంలో ఎలాంటి మార్పూ రాలేదని విమర్శలు చేశారు. 1990లో బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా, వెనుకబడిన రాష్ట్రంగా ఉండేదన్న ప్రశాంత్ కిషోర్... 2022 కి వచ్చేటప్పటికీ అలాంటి పరిస్థితులే ఉన్నాయని ఆరోపించారు. ఇక్కడి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

'జన్ సూరజ్' ప్రచారంలో భాగంగా జాతిపిత జయంతి రోజున బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న గాంధీ ఆశ్రమం నుండి ప్రశాంత్ కిషోర్ 'పాదయాత్ర' ప్రారంభించారు. ఈ యాత్ర పూర్తి కావడానికి 12 నుంచి 15 నెలల సమయం పట్టనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్తకు ఆయన అనుచరులు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రకు ముందు  బిహార్ అభివృద్ధిపై కిషోర్ పలువ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత వెనకబడిన బీహార్ రాష్ట్రాన్ని బాగు చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బీహార్ లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని, గ్రామస్థాయిలో ప్రతి పౌరుడిలో రాజకీయ చైతన్యం తీసుకొస్తానన్నారు. రాజకీయాల్లో రాణించే సత్తా ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తానని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.