- దాదాపు 4 గంటల పాటు కాల్పులు
- ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
- మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు భార్య ఊర్మిళ!
- మావోయిస్టులు లొంగిపోవాలని చత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పిలుపు
భద్రాచలం,వెలుగు:చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ఏరియాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య మంగళ వారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు
మావోయిస్టులు మరణించారు. పార్క్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో బీజాపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ బలగాలతో పాటు ఎస్టీఎఫ్జవాన్లు కూంబింగ్ చేపట్టారు.
బీజాపూర్ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ నేతృత్వంలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్న క్రమంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపు 4 గంటల పాటు ఫైరింగ్ జరగ్గా, కొంతమంది మావోయిస్టులు తప్పించుకుని పారిపోయారు.ఘటనా స్థలంలో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇన్సాస్ ఆటోమెటిక్ గన్, 303 రైఫిల్స్, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహాల ఐడెంటిఫికేషన్ పూర్తయ్యాక వివరాలు తెలియజేస్తామని బస్తర్ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మృతుల్లో మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చన్న, మోస్ట్ వాంటెడ్మావోయిస్టు పాపారావు భార్య ఊర్మిళ ఉన్నట్టుగా తెలుస్తున్నది. కాగా, నేషనల్ పార్కు ఏరియా మావోయిస్టులకు కంచుకోట కావడంతో బలగాలను సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చేందుకు బ్యాకప్ టీమ్‌లను పంపించారు.
లొంగిపోండి: చత్తీస్‌గఢ్ హోంమంత్రి
మావోయిస్టులు లొంగిపోవాలని చత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ్‌శర్మ పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలో కలిస్తే పరిహారం అందజేస్తామని వెల్లడించారు. హిడ్మాతో పాటు ఆయన గ్రామానికి చెందిన దేవ కూడా లొంగిపోవాలని వాళ్ల కుటుంబ సభ్యులను కోరామని తెలిపారు. బస్తర్ఐజీ సుందర్రాజ్ మాట్లాడుతూ.. నేషనల్ పార్కు ఏరియాలో మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధించాయన్నారు. ఇటీవల తెలంగాణ బార్డర్‌లోని తాళ్లగూడెం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించగా, గాయపడిన మరో మావోయిస్టును అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
