BMW కారుతో బైక్ను ఢీకొట్టీ.. పక్కనే ఆస్పత్రి ఉన్నా 19 కి.మీ. తీసుకెళ్లింది.. చికిత్స ఆలస్యం కావడంతో ఉద్యోగి మృతి

BMW కారుతో బైక్ను ఢీకొట్టీ.. పక్కనే ఆస్పత్రి ఉన్నా 19 కి.మీ. తీసుకెళ్లింది.. చికిత్స ఆలస్యం కావడంతో ఉద్యోగి మృతి

న్యూఢిల్లీ: ఖరీదైన కారులో వేగంగా దూసుకెళ్తూ ఓ బైక్ ను ఢీ కొట్టిందో మహిళ.. ఈ ప్రమాదంలో గాయపడ్డ దంపతులను దగ్గర్లోని ఆసుపత్రికి కాకుండా అక్కడికి 19 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. దీంతో ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి సమయానికి వైద్యం అందక చనిపోయాడు. ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలో ఆదివారం చోటుచేసుకుందీ ప్రమాదం. ఈ యాక్సిడెంట్​కు కారణమైన మహిళ గగన్ ప్రీత్ కౌర్​ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో కారులో  ఉన్న ఆమె భర్త పరీక్షిత్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నవజోత్ సింగ్(52), ఆయన భార్య సందీప్ కౌర్‌‌ ఆదివారం ఉదయం బంగ్లా సాహిబ్ గురుద్వారాకు వెళ్లారు. దర్శనం పూర్తయ్యాక అక్కడికి సమీపంలోని ఓ హోటల్​లో భోజనం చేసి బైక్​పై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు వారిని ఢీ కొట్టింది. అతివేగం కారణంగా బైక్​ను ఢీ కొట్టి కారు కూడా బోల్తా పడింది. దీంతో నవజోత్ దంపతులు ఎగిరి పడ్డారు. 

నవజోత్​కు తీవ్రగాయాలు కాగా, సందీప్ కౌర్​కు కూడా గాయాలయ్యాయి. కారు నడిపిన గగన్ ప్రీత్ కౌర్(38) కూడా స్వల్పంగా గాయపడ్డారు. అదే కారులో ఉన్న ఆమె భర్త పరీక్షిత్ మక్కడ్ (40) కు మాత్రం గాయాలు కాలేదు. ప్రమాదం చూసి స్పందించిన స్థానికులతో కలిసి గగన్ ప్రీత్ కౌర్ బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు ఓ వ్యాన్ డ్రైవర్ ను ఆశ్రయించింది. అక్కడికి సమీపంలోనే పలు ఆసుపత్రులు ఉన్నప్పటికీ నవజోత్​ను 19 కి.మీ. దూరంలోని జీటీబీ నగర్​లో గల న్యూలైఫ్​ ఆసుపత్రికి తీసుకెళ్లింది. 

అప్పటికీ తన భర్తను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించాలని సందీప్ కౌర్ ప్రాధేయపడుతున్నా గగన్ ప్రీత్ వినిపించుకోలేదు. న్యూలైఫ్​ ఆసుపత్రికి చేరేసరికి ఆలస్యం కావడంతో కీలక సమయంలో వైద్యం అందక నవజోత్ చనిపోయారు. కాగా, గగన్ ప్రీత్ కౌర్ తండ్రి న్యూలైఫ్​ ఆసుపత్రికి కో ఓనర్ అని, ఈ ప్రమాదానికి సంబంధించి సాక్ష్యాలను మాయం చేయడం కోసమే బాధితులను ఆమె తన తండ్రి ఆసుపత్రికి తరలించిందని పోలీసులు ఆరోపించారు. సందీప్ కౌర్ ఫిర్యాదు మేరకు గగన్ ప్రీత్​పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.