కూసుమంచి, వెలుగు: రహదారులపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకులను కూసుమంచి ఎస్సై నాగరాజు అరెస్టు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీసీ సత్యనారాయణ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కూసుమంచి మండలం పెరికసింగారానికి చెందిన మాదవరుపు శివ రామకృష్ణ, కోక్యా తండాకు చెందిన బానోత్ జశ్వంత్ అనే యువకులు ఖమ్మం నగరంతో పాటు పరిసరాల ప్రాంతాల్లోని హైవేలపై ప్రమాదకర స్టంట్లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పడంతో కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ సోషల్ మీడియా బృందం నిశితంగా పరిశీలిస్తుందని, ఈ తరహా చర్యలకు పాల్పడే వారిపై పోలీసులు మోటరు వాహన చట్టం, పబ్లిక్ న్యూసెన్స్ కింద కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
