బైక్‌‌‌‌ చోరీలపై నజర్‌‌‌‌.. స్క్రాప్‌‌‌‌ చేసి, పేపర్లు మార్చి అమ్మేస్తున్రు

బైక్‌‌‌‌ చోరీలపై నజర్‌‌‌‌.. స్క్రాప్‌‌‌‌ చేసి, పేపర్లు మార్చి అమ్మేస్తున్రు
  • స్క్రాప్‌‌‌‌ చేసి, పేపర్లు మార్చి అమ్మేస్తున్న కన్సల్టెన్సీ నిర్వాహకులు
  • దందాపై స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పెట్టిన సీపీ రంగనాథ్‌‌‌‌
  • సిటీలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు

హనుమకొండ, వెలుగు : వరంగల్‌‌‌‌ నగరంలో కొంతకాలంగా బైక్‌‌‌‌ చోరీలు పెరుగుతున్నాయి. ఇండ్ల ముందు, పార్కింగ్‌‌‌‌ ప్లేసుల్లో పెట్టిన బైక్‌‌‌‌లను గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేస్తున్నారు. వీటిని సిటీలోని కొందరు కన్సల్టెన్సీ నిర్వాహకులు కొని స్క్రాప్‌‌‌‌గా మార్చి అమ్మేయడమో, లేకుంటే రిజిస్ట్రేషన్‌‌‌‌ పేపర్స్‌‌‌‌ మార్చి ఇతరులకు కట్టబెట్టడమో చేస్తున్నారు. బైక్‌‌‌‌ చోరీలు కేసులన్నీ పెండింగ్‌‌‌‌లో పడుతుండడంతో వరంగల్‌‌‌‌ సీపీ ఏవీ.రంగనాథ్‌‌‌‌ స్వయంగా రంగంలోకి దిగి దొంగ బండ్ల దందాపై స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పెట్టారు. ఇందులో భాగంగా కమిషనరేట్‌‌‌‌ పరిధిలోని పోలీస్‌‌‌‌ ఆఫీసర్లతో ఇప్పటికే స్పెషల్‌‌‌‌గా రివ్యూ నిర్వహించారు. మూడు రోజులుగా సిటీ చుట్టుపక్కల ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

ఎత్తుకెళ్లిన బండ్లతో స్క్రాప్‌‌‌‌ దందా

పార్కింగ్‌‌‌‌ ప్రదేశాలు, ఇండ్ల ముందు పెట్టిన బైక్‌‌‌‌లను దుండగులు చోరీ చేస్తున్నారు. వరంగల్‌‌‌‌ నగరంలో ఇటీవలి కాలంలో బైక్‌‌‌‌ చోరీ కేసులు ఎక్కువయ్యాయి. వరంగల్‌‌‌‌ ట్రై సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బండ్లను నగరంలోని కొందరు కన్సల్జెన్సీ నిర్వాహకులు, మెకానిక్‌‌‌‌లు కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత బైక్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌ అన్నీ విడదీసి స్క్రాప్‌‌‌‌ కింద అమ్మేస్తున్నారు. నగరంలో సుమారు 38 బైక్‌‌‌‌ కన్సల్టెన్సీ సంస్థలు ఉండగా, ఇందులో కొందరు ప్రత్యేకంగా ఇదే దందా చేస్తున్నట్లు సమాచారం.

కొంతకాలం కిందట అలంకార్‌‌‌‌ – ​-ములుగు రోడ్డు సమీపంలోని ఓ మెకానిక్, కన్సల్టెన్సీ నిర్వాహకులతో కలిసి బైక్‌‌‌‌లు, కార్లను స్క్రాప్‌‌‌‌గా మారుస్తుండగా వరంగల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. వరంగల్‌‌‌‌ నగరంలో మిస్‌‌‌‌ అయి ఆచూకీ దొరకని బండ్ల సంఖ్య 150కిపైగా ఉండగా, ఇందులో చాలా వరకు స్క్రాప్‌‌‌‌ కింద మారాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా కండీషన్‌‌‌‌ ఉండి, రేటు ఎక్కువ పలుకుతుందన్న బండ్లకు కొందరు కన్సల్టెన్సీ నిర్వాహకులు ఫేక్‌‌‌‌ డాక్యుమెంట్స్‌‌‌‌ సృష్టించి అమ్మేస్తున్నారు.

చోరీ బైక్‌‌‌‌లను గుర్తించేలా స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఏర్పాటు

వరంగల్‌‌‌‌ ట్రై సిటీలో కొంతకాలంగా బైక్‌‌‌‌ చోరీలు ఎక్కువ కావడం, ఆ ప్రభావం పేదలపై పడుతుండడంతో సీపీ రంగనాథ్‌‌‌‌ సీరియస్‌‌‌‌గా తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల ఫస్ట్‌‌‌‌ వీక్‌‌‌‌లో కమిషనరేట్‌‌‌‌ పరిధిలోని పోలీస్‌‌‌‌ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి బైక్‌‌‌‌ చోరీలు చేసే వ్యక్తుల సమాచారం, దొంగ బండ్ల దందా చేసే కన్సల్టెన్సీలు, పాత ఇనుప సామాను వ్యాపారుల వివరాలు ఆరా తీశారు. బైక్‌‌‌‌లతో పాటు ఇతర దొంగతనాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా పెట్టేందుకు ఏసీపీ రమేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ నేతృత్వంలో ఓ స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌ను కూడా నియమించారు. 

కన్సల్టెన్సీలు, పాత ఇనుప సామాను వ్యాపారులతో మీటింగ్‌‌‌‌ పెట్టి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్‌‌‌‌ పెడుతామని హెచ్చరించారు. అలాగే నగరంలో ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీ చేయడంతో పాటు, బండికి సంబంధించిన ప్రతి ఒక్కటీ చెక్‌‌‌‌ చేయాలని పోలీసులను ఆదేశించారు. సరైన పేపర్లు లేని, రిజిస్ట్రేషన్‌‌‌‌ నంబర్‌‌‌‌, ఛాసిస్‌‌‌‌ నంబర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ కాని బండ్లను స్టేషన్‌‌‌‌కు తరలించి ఒరిజినల్‌‌‌‌ పేపర్స్‌‌‌‌ చూపిస్తేనే బైక్‌‌‌‌ తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పనిలో పనిగా డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లు, ఇన్సూరెన్స్‌‌‌‌ పేపర్లపైనా ఫోకస్‌‌‌‌ పెట్టారు.

చాలా వెహికల్స్‌‌‌‌ పట్టుబడుతున్నయ్‌‌‌‌

చోరీ చేసిన బైక్‌‌‌‌లను గ్రామీణ ప్రాంతాల్లో, కన్సల్టెన్సీలకు అమ్ముతున్నారు. మరికొందరు స్క్రాప్‌‌‌‌గా మార్చేస్తున్నారు. చోరీలను తగ్గించేందుకు సిటీ పరిధిలో ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నాం. ఛాసిస్‌‌‌‌, ఇంజిన్‌‌‌‌ నంబర్‌‌‌‌, ఆర్సీ నంబర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ కానీ వెహికల్స్‌‌‌‌ చాలా పట్టుపడుతున్నయ్. కన్సల్టెన్సీలు, స్క్రాప్‌‌‌‌ వ్యాపారులకు తగిన సూచనలు ఇచ్చాం. ప్రజలు కూడా ఒరిజినల్‌‌‌‌ పేపర్స్ లేని బండ్లు కొనొద్దు.

 ఏవీ.రంగనాథ్, వరంగల్‌‌‌‌ సీపీ