
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో ఒక వాహనదారుడు చేసిన నిరసన ఆలోచింపజేసింది. ప్రజల్లో చైతన్యం రగిల్చింది. "పోలీసు కమిషనర్ మరియు కలెక్టర్ గారు.. రోడ్డు పైన నేను ఏది ధరించక పోయినా అన్నింటికీ ఫైన్ కడుతున్నాను. అసలు రోడ్లే సరిగా లేవు.. మరి మీరు నాకెంత ఫైన్ కడతారు" అంటూ కరీంనగర్లో కోట శ్యామ్ కుమార్ అనే యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. గుంతలు పడ్డ రోడ్లపై కూర్చొని ప్లకార్డుతో ఈ యువకుడు నిరసన తెలిపిన తీరు కరీంనగర్ పట్టణ ప్రజలను ఆలోచింపజేసింది.
గుంతల్లేని రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అంటూ గత పాలకులు గొప్పలు చెప్పిన కరీంనగర్ స్మార్ట్ సిటీ డొల్లతనం రెండు గంటలు వాన పడితే బయటపడుతున్న పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలోని ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. ఇండ్లు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నరకం చూశారు. ఇండ్లలోకి చేరిన నీటిని ఎత్తి పోసుకోవడానికి, బురదను కడుక్కోవడానికే రోజంతా పట్టింది. నీరు ఇండ్లలోకి చేరడానికి ముందుచూపు లేకుండా కట్టిన డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలే కారణమని జనం ఆరోపిస్తున్నారు.
వర్షాలు పడితే సిటీలోని కశ్మీర్‌గడ్డ, ముకరంపుర, సాయినగర్, మంకమ్మ తోట, జ్యోతినగర్, హస్సేనిపుర, శర్మ నగర్, బుట్టి రాజారాంనగర్ కాలనీ, ఆర్టీసీ వర్క్ షాప్ ఏరియా, విద్యానగర్ సెయింట్ జాన్స్ స్కూల్ ఏరియా, రాంనగర్‌లోని ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఇక కలెక్టరేట్, టౌటౌన్ పీఎస్, సీపీ ఆఫీస్, మంచిర్యాల చౌరస్తా ఏరియాల్లో రోడ్లపై మోకాలి లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి.
ALSO READ : మున్సిపాలిటీల్లో స్టేట్ క్లైమేట్ సెంటర్.. వాతావరణ మార్పులపై అప్రమత్తం చేసేలా ఏర్పాటు
స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన రోడ్లను ప్లానింగ్ లేకుండా నిర్మించారన్న విమర్శలు ఉన్నాయి. వర్షం నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా.. సైడ్ డ్రైన్లలోకి వెళ్లేలా మ్యాన్‌హోల్స్ ఏర్పాటు చేయలేదని, అండర్ గ్రౌండ్ డ్రెనేజీని ఎక్కడికక్కడే క్లోజ్ చేయడం వల్ల సమస్య తలెత్తిందని పలువురు మండిపడుతున్నారు.