
శామీర్ పేట, వెలుగు: విధులు నిర్వహిస్తున్న మహిళా ట్రాఫిక్ ఏఎస్ఐను బైక్‌తో ఢీకొట్టి ఓ వ్యక్తి పరారయ్యాడు. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూముకుంటలో మంగళవారం హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న వారికి ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. తూముకుంట నుంచి అల్వాల్ వైపు వస్తున్న ఓ వ్యక్తి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ రజినీని ఢీకొట్టాడు. దీంతో ఆమె కాలు, చేతికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బైక్‌ను అక్కడే వదిలి పరారయ్యాడు. బైక్‌కు రిజిస్ట్రేషన్ కాలేదు. బైక్‌తో ఢీకొట్టి పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.