
కొందరికి ఫ్యాన్సీ నంబర్లపై విపరీతమైన మోజు ఉంటుంది. బండి రిజిస్ట్రేషన్ నంబర్ మొదలుకుని మొబైల్ నంబర్ దాకా కొందరు ఫ్యాన్సీ నంబర్లనే వాడుతుంటారు. ఆ ఫ్యాన్సీ నంబర్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఆ నంబర్ కోసం కొన్ని సార్లు కోటి రూపాయలైనా ఖర్చు చేస్తారు. కొందరైతే వేలంలో ఆ ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవడాన్ని పరువుగా భావిస్తారు. అలాంటి వాళ్లలో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన హార్డ్ వేర్ వ్యాపారి సంజీవ్ కుమార్ ఒకరు. లక్ష రూపాయలతో స్కూటీ కొన్న సంజీవ్ 14 లక్షలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ సొంతం చేసుకున్నాడు. అంటే.. స్కూటీ కొన్న ధర కంటే ఫ్యాన్సీ నంబర్ కోసం సంజీవ్ 13 లక్షలు ఖర్చు చేశాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అయింది.
హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ కు చెందిన సంజీవ్ కుమార్ HP21C-0001 ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ను 14 లక్షలకు దక్కించుకున్నాడు. ఆన్ లైన్ లో నిర్వహించిన వేలంలో ఆ ఫ్యాన్సీ నంబర్ కోసం ఇద్దరు పోటీపడ్డారు. ఆ ఇద్దరిలో ఒకరు 13.5 లక్షల వరకూ వేలం పాడారు. సంజీవ్ కుమార్ 14 లక్షలు పాడి ఆ నంబర్ను సొంతం చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి సంజీవ్ కుమార్ కట్టిన 14 లక్షలు జమ కావడం గమనార్హం.
హిమాచల్ ప్రదేశ్ హిస్టరీలోనే ఇంత పెద్ద మొత్తం పలికిన టూవీలర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇదే కావడం విశేషం. అంత ఖర్చు చేసి ఈ రిజిస్ట్రేషన్ నంబర్ దక్కించుకోవడంపై సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి అరుదైన నంబర్స్ అంటే తనకు ఎంతో మక్కువ అని.. ఏదైనా మనకు ఎక్స్రార్డినరీగా కావాలనుకున్నప్పుడు ఖర్చు గురించి వెనకాడకూడదని చెప్పుకొచ్చాడు. హిమాచల్ ప్రదేశ్ లో వీఐపీలు వాడే సిరీస్ లో ఈ ఫ్యాన్సీ నంబర్ ఉండటం వల్లే సంజీవ్ కుమార్ ఇంత ఖర్చు చేసి మరీ దక్కించుకున్నాడు.