రెక్కల కారు‌‌‌‌కు పెట్రోల్‌‌‌‌ అక్కర్లేదు

రెక్కల కారు‌‌‌‌కు పెట్రోల్‌‌‌‌ అక్కర్లేదు

చిన్నప్పటి నుంచే ఒక్కొక్కరికి ఒక్కో కల ఉంటుంది. చదువు అడ్డుపడో, డబ్బు లేకనో వాటిని తీర్చుకోలేనివాళ్లు కొందరుంటారు. ఆ కలల్ని ఏనాటికైనా నెరవేర్చుకోవాలని గట్టిగా ఫిక్స్​ అయినవాళ్లు ఇంకొందరు ఉంటారు. తను కన్న కలను  నలభై ఏండ్ల వయసులో నెరవేర్చుకున్న బిలాల్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ కథ కూడా అలాంటిదే.

జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లో పుట్టిపెరిగాడు అహ్మద్‌‌‌‌. మెకానికల్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ చదివాడు. అక్కడి కాలేజీలో మ్యాథ్స్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. పేద ప్రజలకు అందుబాటు ధరలో ఉండే కారు తయారుచేయాలని చిన్నప్పటినుంచి అనుకునేవాడు. అనుకున్నట్టుగానే సోలార్ ఎనర్జీతో నడిచే కారు‌‌‌‌ తయారుచేసి, ‘నేను ఇండియన్‌‌‌‌ ఎలాన్‌‌‌‌ మస్క్‌‌‌‌’ అంటున్నాడు. 

పదకొండేండ్ల కల

మెకానికల్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ చదివే రోజుల్లోనే దివ్యాంగుల కోసం ఒక సూపర్ కారు‌‌‌‌ తయారుచేయాలి అనుకునేవాడు. అదెలా ఉండాలంటే... తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇవ్వాలి. దివ్యాంగులు తమంతటతాము నడపగలిగేలా డిజైన్‌‌‌‌ చేయాలని కలలు కనేవాడు. కానీ, ఆ ప్రాజెక్ట్‌‌‌‌కు కావాల్సిన డబ్బులు దగ్గర లేవు. సపోర్ట్‌‌‌‌ ఇవ్వమని చాలా కంపెనీలను అడిగాడు. కానీ, ఎవ్వరూ సాయం చేయలేదు. దాంతో అహ్మద్‌‌‌‌ కన్న కల, కలగానే మిగిలిపోయింది. మార్కెట్‌‌‌‌లోకి కూడా దివ్యాంగుల కోసం మాడిఫైడ్‌‌‌‌ కార్లు చాలానే వచ్చాయి. అయినా, ఏనాటికైనా కారు‌‌‌‌ తయారు చేయాల్సిందే అనుకునేవాడు. ఆ పట్టుదలే ఇప్పుడు సోలార్ పవర్‌‌‌‌‌‌‌‌తో నడిచే కార్‌‌‌‌‌‌‌‌ తయారుచేసేలా చేసింది.

ఎలా పనిచేస్తుందంటే...

పెరుగుతున్న పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ రేట్లతో సామాన్య ప్రజ లు సొంత బండ్లపైన తిరగడం తగ్గించారు. దాంతో సొంత కారు‌‌‌‌ కొనాలన్న వాళ్ల ఆశ కూడా వదిలేసుకుంటున్నారు. అలాంటి వాళ్ల కోసం తయారు చేసిందే ఈ సోలార్‌‌‌‌‌‌‌‌ కారు. మారుతి సుజికి 800 కారు‌‌‌‌ మాడిఫై చేశాడు. డిక్కీ డోర్‌‌‌‌‌‌‌‌కు, ఇంజిన్‌‌‌‌ బానెట్‌‌‌‌కు సోలార్‌‌‌‌‌‌‌‌ పానెల్స్‌‌‌‌ పెట్టాడు. నాలుగు డోర్లను తీసేసి ఫెరారీ కార్‌‌‌‌‌‌‌‌కు ఉండే ఓపెన్‌‌‌‌ డోర్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ పెట్టి, వాటికీ రెండు పానల్స్  ఏర్పాటుచేశాడు. ఒక్క బటన్‌‌‌‌ నొక్కితే చాలు ఈ డోర్లు అన్నీ తెరుచుకొని ఓపెన్ టాప్‌‌‌‌ కార్‌‌‌‌‌‌‌‌లా మారుతుంది. ఇంజిన్‌‌‌‌ తీసేసి బ్యాటరీల్ని పెట్టాడు. ఎండ ఎలా ఉన్నా ఛార్జింగ్‌‌‌‌ అయ్యేందుకు వీలుగా మోనోక్రిస్టలైన్‌‌‌‌ సిలికాన్‌‌‌‌ సోలార్ పానల్‌‌‌‌లను వాడాడు. ఇవి సూర్యుడి కిరణాలలోని వేడిని లాక్కుని కరెంట్‌‌‌‌ తయారుచేసి, బ్యాటరీల్లో నింపుతాయి. ఈ కారు‌‌‌‌ నడుస్తున్నప్పుడు కూడా ఛార్జింగ్‌‌‌‌ అవుతుంది. దీనికోసం డిఎమ్‌‌‌‌సి అనే యుఎస్‌‌‌‌ ఆటోమొబైల్‌‌‌‌ కంపెనీ సహకారం తీసుకున్నాడు అహ్మద్‌‌‌‌. రెక్కల్లా ఉన్న డోర్లను చూసి ‘రెక్కలు కట్టుకున్న ఈ కారు ఏదో ఒక రోజు ఎగురుతుంది’ అని సోషల్‌‌‌‌ మీడియాలో కామెంట్స్‌‌‌‌ పెడుతున్నారు.