పాక్ ఉగ్ర సంస్థలకు నిలయం.. ఒప్పుకున్న బిలావల్ భుట్టో.. ఆ కారణంగానేనట..

పాక్ ఉగ్ర సంస్థలకు నిలయం.. ఒప్పుకున్న బిలావల్ భుట్టో.. ఆ కారణంగానేనట..

స్వాతంత్ర్యం తర్వాత భారత్ నుంచి పాక్ విడిపోయిన తర్వాత ఆ దేశం తమ అభివృద్ధి మీద కంటే ఇండియా పతనంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఉగ్రవాద సంస్థలు, జిహాదీలను పెంచి పోషించింది. వారికి ట్రైనింగ్ నుంచి ఆయుధాలు, ఇంటెలిజెన్స్ వరకు అన్నింటా తానై ముందుకు నడిపింది పాక్ ఆర్మీ, ప్రభుత్వం. అయితే పెంచి పోషించిన పాము తిరిగి కాటేయక మానదు అన్నట్లు ప్రస్తుతం దాని విపరీత పరిణామాలను అనుభవిస్తోంది. 

ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ తమ దేశం ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని అంగీకరించారు. ఇదే సమయంలో ఆయన బిలావల్ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడాన్ని ఖండించారు. పాకిస్తాన్ ఏ ఉగ్రవాద సంస్థను ప్రోత్సహించదని భుట్టో భారత జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ స్వయంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఉగ్రవాదంపై పోరాటంలో 92వేల మందిని చంపామన్నారు. కేవలం ఒక్క ఏడాదిలో 2వేల మంది మరణించారని పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్ చరిత్రలో అత్యంత రక్తపాత సంవత్సరంగా అభిప్రాయపడ్డారు. 

2009లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను సిద్ధం చేసిందని మీ తండ్రి ఒప్పుకున్నారా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన భుట్టో.. పాక్-భారత ఉపఖండంలో ఉగ్రవాదం ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం కారణంగానే ఏర్పడిందని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో జిహాద్ చాలా కాలం కొనసాగిందని, దాని వల్ల పాకిస్తాన్ కూడా దాని ప్రభావాలను అనుభవించాల్సి వచ్చిందంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని వాస్తవాలను అంగీకరించిన భుట్టో.. పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సంస్థలు ప్రజలను ఆఫ్ఘనిస్తాన్‌లో జిహాద్‌లో ఉపయోగించుకున్నట్లు చెప్పారు. 

అలాగే కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంలో పాక్ సైన్యం, ఐఎస్ఐ, పాక్ ప్రభుత్వ పాత్రను ఖండించారు. ఆఫ్ఘన్ ప్రాంతంలో మెుదలైన జీహాదీ సంస్థలు తర్వాత కశ్మీర్ వరకు వ్యాప్తి చెందాయని అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో లష్కర్ ప్రమేయంతో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫోర్స్ విషయంలో సదరు సంస్థపై తాము చర్యలు తీసుకున్నమని భుట్లో చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఏ దర్యాప్తులోనైనా పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధాని చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

ALSO READ  : Tax Raids: పన్నుశాఖ కొత్త బాంబ్.. లగ్జరీ ఇళ్ల యజమానులే టార్గెట్, ఏం చేస్తోందంటే?

2022లో హఫీజ్ సయీద్ కు 31 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిందని బిలావల్ చెప్పారు. అయితే.. ముంబై దాడి కేసులో చర్యలు ఆలస్యం కావడానికి భారత్ ని నిందించారు. భారతదేశం విచారణలో సహకరించలేదని, సాక్షులను హాజరుపరచడానికి నిరాకరించిందని అన్నారు. ఇదే క్రమంలో హఫీజ్ సయీద్ పై మాట్లాడిన బిలావల్ భుట్టో ప్రస్తుతం అతను జైలులో ఉన్నట్లు చెప్పారు. పాక్ కూడా అతనిపై దర్యాప్తు చేస్తోందని అన్నారు. అలాగే మరో ఉగ్రవాది మసూద్ అజార్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ దేశంలో ఉంటున్నట్లు చెప్పారు. మెుత్తానికి ఉగ్రవాదం కారణంగా భారత్-పాక్ రెండూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అయితే హఫీజ్ సయీద్ అరెస్ట్ అయ్యింది టెర్రర్ ఫండింగ్ కేసులోనే కానీ భారత దాడుల కేసులో కాదు.