తెలంగాణలో హుక్కా బ్యాన్ .. ఏకగ్రీవంగా సభ ఆమోదం

తెలంగాణలో హుక్కా బ్యాన్ ..  ఏకగ్రీవంగా సభ ఆమోదం

 

  • పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లుకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం
  •     శిక్షలు కఠినతరం చేస్తూ చట్ట సవరణ
  •     ఏడాది నుంచి ఏడేండ్ల దాకా జైలు శిక్ష
  •     బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు
  •     ఏకగ్రీవంగా ఆమోదించిన అధికార, ప్రతిపక్ష సభ్యులు

హైదరాబాద్‌‌, వెలుగు :  హుక్కా సెంటర్లపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ – 2024 సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు కౌన్సిల్ లో ప్రవేశపెట్టారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్​లో.. అధికార, ప్రతిపక్షాలు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో మంత్రి శ్రీధర్ బాబు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘యువత, కాలేజ్ స్టూడెంట్స్ హుక్కాకు అలవాటుపడ్డారు. అదొక వ్యసనంగా మారింది. దీంతో వారి భవిష్యత్తు నాశనం అవుతున్నది. హుక్కా పీల్చడంతో ఆరోగ్యం దెబ్బతింటున్నది. సిగరెట్ పొగ కంటే హుక్కా ఎంతో హానికరం. హుక్కా కోసం బొగ్గు ఉపయోగించడంతో కార్బన్‌‌ మోనాక్సైడ్‌‌ రిలీజ్ అవుతుంది. ఇది పీల్చుకునేవారితో పాటు చుట్టుపక్కల వారి హెల్త్ కూడా ఖరాబ్ అయితది. హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని సీఎం భావించారు’’అని శ్రీధర్ బాబు అన్నారు. 

స్కూల్స్, కాలేజీల్లో అవగాహన కల్పించాలి: బీఆర్ఎస్ సభ్యులు

గ్రామాల్లో గంజాయి వాడకం బాగా పెరిగిందని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు, ఎక్సైజ్‌‌ అధికారుల సహాయంతో స్కూల్స్, కాలేజీల్లో అవగాహన తరగతులు నిర్వహించాలని సూచించారు. తర్వాత బీఆర్‌‌ఎస్‌‌ సభ్యులు సురభి వాణిదేవి, కవిత మాట్లాడారు. హుక్కా సైలెంట్ కిల్లర్ అని, ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని అన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో యువత చెడుదారి పట్టే ప్రమాదం ఉందని తెలిపారు. మహారాష్ట్ర బార్డర్ ఏరియాల్లో పాన్ మసాలా పేరిట గుట్కాలు, గంజాయి రవాణ అవుతున్నదన్నారు.  శాసన మండలిలో తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలపై  శాసన మండలిలో ప్రత్యేక ప్రస్తావనకు అవకాశం ఇవ్వాలని కవిత కోరారు.  ఖమ్మం, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లాల గుండా చాక్లెట్లు, లిక్విడ్ రూపంలో గంజాయి రాష్ట్రంలోకి వస్తున్నదని సభ్యులు తాత మధు, భానుప్రసాద్‌‌ తెలిపారు. 

హుక్కా సెంటర్లపై నిషేధం సంతోషకరం :  కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

యువతను పెడదోవ పట్టిస్తున్న హుక్కా సెంటర్లపై నిషేధం విధించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ సభ్యులు జీవన్‌‌ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, టీచర్‌‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. హుక్కా సెంటర్లతో పాటు గుట్కా, గంజాయి వంటి వాటిపై కూడా నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. దీనికి ముందు ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీగా సేవలందించిన పి.నర్సారెడ్డి మృతిపట్ల కౌన్సిల్‌‌ సంతాపం ప్రకటించింది. తర్వాత పాడి పరిశ్రమకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని కాంగ్రెస్‌‌ సభ్యుడు జీవన్‌‌ రెడ్డి, విమానాశ్రయాల్లో ప్రొటోకాల్‌‌ పాటించాలని బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్సీ తాత మధు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.

స్పెషల్ డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు :  శ్రీధర్ బాబు

యువత పక్కదారి పట్టకుండా ఉండాలంటే హుక్కా సెంటర్లపై నిషేధం ఎంతో అవసరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చట్టంలోని సవరణలు పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. డ్రగ్స్​ అరికట్టేందుకు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని అడిషనల్‌‌ డీజీపీ స్థాయి అధికారితో కొనసాగిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి చాక్లెట్లు, లిక్విడ్, సిగరెట్స్​ రూపాల్లో వస్తున్న గంజాయి.. యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి గంజాయి విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కనీసం ఏడాది నుంచి ఏడేండ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని రూపొందించినట్టు తెలిపారు. కిరాణ షాపుల్లో మత్తు పదార్థాలు దొరుకుతున్నాయని, వాటిని పకడ్బందీగా నిరోధించాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు అన్నారు.