చెఫ్‭గా మారిన బిల్ గేట్స్.. బ్లాగర్‭తో కలిసి రోటీ తయారీ

చెఫ్‭గా మారిన బిల్ గేట్స్.. బ్లాగర్‭తో కలిసి రోటీ తయారీ

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తమకు సమయం దొరికినప్పుడల్లా వంటింట్లోకి దూరిపోతున్నారు. ఏదో ఒక వంటకం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా అమెరికన్ వ్యాపారవేత్త బిల్ గేట్స్ కాసేపు చెఫ్‭గా మారిపోయారు. ప్రముఖ బ్లాగర్ ఈటాన్ బెర్నాథ్‭తో కలిసి భారతీయ వంటకం అయిన గోధుమ రోటీని తయారు చేశారు. ఈ వీడియోను బ్లాగర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. బిల్ గేట్స్‭తో కలిసి తాను రోటీని తయారు చేసినట్లు చెప్పాడు. ఇక ఈ వీడియోలో బిల్ గేట్స్ స్వయంగా గోధుమ పిండిని తీసుకుని ముందుగా నీరు, ఉప్పుతో కలిపారు. తన చేతులకు బదులుగా గరిటెను తీసుకుని పిండిని బాగా కలిపారు. తరువాత తానే స్వయంగా పిండి ముద్దను తీసుకుని రోటీ చేశారు.

ఈ సందర్భంగా తాను చాలా కాలం తర్వాత వంట చేస్తున్నానని.. రోజూ సూప్ మాత్రమే వేడి చేసుకుంటానని బిల్ గేట్స్ చెప్పారు. తర్వాత బ్లాగర్ కూడా ఓ రోటీ తయారు చేశాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ చపాతీకర్రతో రొట్టెను తయారు చేసి.. తవాపై కాస్త నెయ్యి వేసి రోటీలను కాల్చారు. తర్వాత రోటీలను ఆస్వాదిస్తూ ఇద్దరూ కలిసి తిన్నారు. ఒక వ్యాపారవేత్త అయి తనతో కలిసి ఇలా రోటీని తయారు చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని బ్లాకర్ ఈటాన్ బెర్నాథ్ తెలిపాడు. ఇక రీసెంట్‭గా తాను బీహార్ వెళ్లివచ్చినట్లు చెప్పాడు. మహిళలతో కలిసి అక్కడి సంస్కృతి, వంటకాలను తెలుసుకున్నట్లు బ్లాగర్ వివరించాడు. వారి వద్ద తాను చపాతీ చేయడం నేర్చుకున్నానని బిల్ గేట్స్ తో తన బీహార్ టూర్ విశేషాలను పంచుకున్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది సేపటికే లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‭గా మారింది.