బతుకమ్మ చీరలకు ఆర్డరయితే వచ్చింది కానీ.. బిల్లులయితే వస్తలేవు

బతుకమ్మ చీరలకు ఆర్డరయితే వచ్చింది కానీ.. బిల్లులయితే వస్తలేవు

బతుకమ్మ చీరల బకాయిలు రూ.170 కోట్లు
అప్పుల ఊబిలో సిరిసిల్ల నేతన్నలు

బిల్లుల కోసం ఎదురుచూపులు
రేపు మాపు అంటూ దాటవేస్తున్న అధికారులు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రూ. 300 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్​వచ్చింది.. కొన్ని నెలలపాటు ఉపాధి తిప్పలు తప్పుతాయని అనుకున్నారా నేత కార్మికులు. వచ్చిన ఆర్డర్​లో సగానికిపైగా పూర్తి చేశారు. అయితే వస్త్రాన్ని తీసుకున్న ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదు. బయట అప్పు తెచ్చి పనులు చేశామని, మిత్తి చెల్లించలేకపోతున్నామని మరోవైపు తయారీదారులు వాపోతున్నారు. బిల్లులు ఎప్పుడు వస్తాయా అంటూ ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు ప్రతి సంవత్సరం చీరలను ప్రభుత్వం కానుకగా అందిస్తోంది. మొదట్లో బయటి రాష్ట్రాల నుంచి చీరలను తెప్పించారు. ఆ చీరల నాణ్యత అంతగా బాగాలేకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో రాష్ట్రంలోనే చీరలను తయారు చేయిస్తే నేత కార్మికులకు ఉపాధి దొరకడంతోపాటు చీరల నాణ్యత కూడా బాగుంటుందని ఆలోచించారు. అందులో భాగంగా సిరిసిల్ల నేత కార్మికులకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం చీరల ఆర్డర్​ ఇస్తోంది. ఈ ఏడాది కూడా​ రూ.300 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్ ​సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల  కేంద్రంలో 16 వేల మంది నేత కార్మికులు ప్రత్యక్షంగా, సుమారు 25 వేల మంది కార్మికులు పరోక్షంగా బతుకమ్మ చీరల ఆర్డర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు 7 కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల తయారీకి రూ.300 కోట్లతో ఆర్డర్​ఇచ్చింది. ఇప్పటికే 4.75 కోట్ల మీటర్ల వస్త్రం తయారు చేశారు. సిరిసిల్ల నేత కార్మికులు నిర్వహిస్తున్న సొసైటీలు, ఎస్ఎస్ఐ సంఘాల నుంచి ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేసిన వస్త్రం ధర సుమారు రూ.170 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ నయాపైసా కూడా విడుదల చేయలేదు. ఆసాములు యార్న్, ముడి సరుకుల కొనుగోలుకు రూ.2 నుంచి 3 వరకు వడ్డీకి ప్రైవేట్​ వ్యాపారుల వద్ద అప్పు తెచ్చి మరీ బతుకమ్మ చీరలు తయారు చేస్తున్నారు. సకాలంలో బిల్లులు వస్తాయనుకున్న నేతన్నలకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వడ్డీ భారం మోయలేకపోతున్నారు. తమ వద్ద పని చేసే కార్మికులకు ప్రతి వారం కూలి డబ్బులు సైతం చెల్లించలేకపోతున్నారు. పలుసార్లు మంత్రి కేటీఆర్ కు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు విన్నవించినా లాభం లేకుండా పోయింది. గత సంవత్సరం బతుకమ్మకు సెప్టెంబర్​ వరకు నాలుగు విడతలుగా రూ. 100 కోట్లకు పైగా బిల్లులను సర్కారు చెల్లించిందని, ఈసారి మాత్రం పైసా కూడా రాలేదని తయారీదారులు వాపోతున్నారు.

వారం వారం పగార్​ పడతలేదు

మా సేట్లకు బతుకమ్మ చీరల పైసలు వస్తలేవని మాకు వారం వారం పైసలు ఇస్తలేరు. రెండు మూడు వారాలకొకసారి కూలి పైసలిస్తుండ్రు. దీంతో బాగా తిప్పలౌతోంది. ఏ పూటకు ఆ పూట చేసుకునే మాకు వారం వారం పగార్​ ఇస్తేనే మంచిగుంటది.

‑ పత్తిపాక రాజేందర్, నేత కార్మికుడు, సిరిసిల్ల

అప్పుల పాలవుతున్నం
సమయానికి బతుకమ్మ చీరల బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నం. అప్పులు తెచ్చి ముడి సరుకులు కొన్నం. సమయానికి షావుకారుకు పైసలు కట్టక మాట పోతోంది. కొత్తగా అప్పు పుడతలేదు. కార్మికులకు కూలి ఇవ్వడానికి కష్టమవుతోంది. వారం వారం ఇచ్చే కూలి రెండు మూడు వారాలకు ఒక్కసారి ఇస్తున్నం. త్వరగా బతుకమ్మ చీరల బిల్లులు ఇప్పించాలి. ‑ బత్తుల ఆంజనేయులు, సిరిసిల్ల

త్వరలోనే బిల్లులు చెల్లిస్తాం

బతుకమ్మ చీరల బకాయిలు సుమారు రూ.150 కోట్లు ఉన్నాయి. బిల్లు విడుదలకు పై అధికారులకు పంపించాం. డైరెక్టర్​ మేడంతో ఇక్కడి పరిస్థితిని వివరించాం. చెక్కులు తయారయ్యాయి. రెండు మూడు రోజుల్లో వస్తాయని చెప్పారు. త్వరలో బిల్లులు చెల్లిస్తాం.

‑ ఆశోక్​రావ్, ​ఏడీ, చేనేత జౌళిశాఖ, రాజన్నసిరిసిల్ల

For More News..

ఫింగర్​ ఏరియాల్లో సై అంటే సై

కరెంట్ బండితో వంద కి.మీకి ఖర్చు పది రూపాయలే..

టీ20లలోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్న యువరాజ్!

వీడియో: రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. స్టేడియం ముందు వెళ్తున్న బస్‌పై పడింది