పంచాయతీ కార్యదర్శులకు బయోమెట్రిక్.. తప్పుడు హాజరు నమోదు చేసిన వారిపై వేటు..

పంచాయతీ కార్యదర్శులకు  బయోమెట్రిక్.. తప్పుడు హాజరు నమోదు చేసిన వారిపై వేటు..
  • టీజీ టీఎస్ సంస్థకు కాంట్రాక్టు
  • ఎంపీఓలు, డీపీఓల నిర్లక్ష్యంపైనా ఆరా
  • వేటుకు సన్నద్ధమవుతున్న ఉన్నతాధికారులు
  • మంత్రి ఆదేశాలతో కదిలిన పంచాయతీరాజ్ యంత్రాంగం

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ కార్యదర్శులకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చేందుకు పంచాయతీ రాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. కొందరు కార్యదర్శులు ఫేక్ హాజరుతో విధులకు గైర్హాజర్ అవుతుండటం.. లొకేషన్లలో ఫొటోలు తీసినట్లు అటెండెన్స్ వేసుకుంటూ పంచాయతీలకు వెళ్లడం లేదని అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో అన్ని పంచాయతీ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలు కోసం టీజీ టీఎస్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించినట్టు తెలిసింది. 

దీంతో కార్యదర్శులు విధిగా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అటెండెన్స్ వేయాల్సిందే. కాగా, ఈ మేరకు ఫేక్ అటెండెన్స్ వేసిన ముగ్గురు కార్యదర్శులను సస్పెండ్ చేసింది. ఎంపీఓలు, డీపీఓల నిర్లక్ష్యంపై ప్రభుత్వం ఆరా తీస్తున్నది. విధుల్లో నిర్లక్ష్యంచేసిన వారిపై వేటు వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం 8 నెలల క్రితం డైలీ శానిటేషన్ రిపోర్టు యాప్​లో ఫేస్ రికగ్నైజ్డ్ మాడ్యూల్ తీసుకొచ్చింది. ఈ యాప్​లో కార్యదర్శులు విధులు నిర్వర్తించే గ్రామంలో లొకేషన్​కు వెళ్లి ఫొటో తీసి పంచాయతీ యాప్​లో నమోదు చేసి అటెండెన్స్ వేసుకోవాలి. 

ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగులు హాజరు పర్యవేక్షణ కోసం కొత్త టెక్నాలజీలు వచ్చినా.. వాటిని కూడా మోసం చేయడానికి కొత్త దారులు వెతుకుతున్నారు. జగిత్యాలలో తన అటెండెన్స్ వేసుకోవడానికి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను ఉపయోగించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా రోజూ ఒకే ఫొటో అప్‌‌లోడ్ చేస్తుండటంతో అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో  జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందయాపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి రాజన్న సీఎం రేవంత్ రెడ్డి ఫొటో తో హాజరు వేసినట్లు వెలుగులోకి రావడంతో ఆ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ జగిత్యాల కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఫరూక్ నగర్ మండలం భీమారం గ్రామ కార్యదర్శి అనిల్ కుమార్, ఆమనగల్ మండలం సింగంపల్లి కార్యదర్శి జంగయ్యను సస్పెండ్ చేశారు.

రోజుకో ఫొటోతో విధులకు డుమ్మా..

రాష్ట్రంలో 1,500 గ్రామ పంచాయతీల కార్యదర్శులు సెలవుల్లో (మెటర్నరీ, హెల్త్ సమస్యలతో) ఉండటంతో కొంతమంది కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనికి తోడు కొంతమంది కార్యదర్శులు  రోజుకో ఫొటో పెడుతూ విధులకు డుమ్మా కొడుతున్నారు .. అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేపట్టడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 కొందరు విధులకు వెళ్లకుండా ఇతరుల సాయంతో , తమ ఫోన్లను మల్టీపర్పస్ వర్కర్లకు ఇచ్చి యాప్ తో హాజరు నమోదు చేస్తున్నట్లు గుర్తించారు.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100మందిపైగా  కార్యదర్శుల పై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. శుక్రవారం ఖమ్మం జిల్లాలో ఇద్దరిపై, నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరిపై, ఆదిలాబాద్ జిల్లాలో ఒక కార్యదర్శిపై ఫిర్యాదు అందినట్లు విశ్వసనీయ సమాచారం. వారందరిపై  వేటు వేయనున్నట్లు తెలిసింది. 

ఎంపీఓలు, డీపీఓలపై వేటు?

యాప్​లో అప్ లోడ్ చేస్తున్న ఫొటో వ్యక్తిదేనా? నేరుగా దిగి అప్ లోడ్ చేశారా? ఫొటోను తీసి అప్ లోడ్ చేశారా? అనేది పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంపీలు, డీపీఓలపై ఉంది. అయినప్పటికీ కొందరు కార్యదర్శులు ఖాళీ కుర్చీల ఫొటోలు, ఇతర వ్యక్తుల ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఎంపీఓలు, డీపీఓల పనితీరుపై ఆరా తీసినట్లు సమాచారం. వారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలింది. దీంతో చేపట్టిన పరిశీలనలో పలువురు కార్యదర్శులు విధులకు హాజరకుండానే అటెండెన్స్​ వేసుకుంటున్నట్టు గుర్తించారు. దీంతో వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 

ఫేక్ అటెండెన్స్ తో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సైతం ఆదేశించారు. శుక్రవారం బయోమెట్రిక్ మిషన్లపై పీఆర్ ఆర్ డీ డైరెక్టర్ స్రుజన సైతం బయోమెట్రిక్ మిషన్ల ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గతంలోనూ మిషన్ల ఏర్పాటుపై ప్రపోజల్స్ పంపినా  ఆలస్యం జరగడానికి గల కారణాలపై ఆరా తీసినట్లు తెలిసింది. త్వరలోనే అన్ని గ్రామపంచాయతీల్లో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 

మొదటి తప్పుగా భావించి మినహాయింపు ఇవ్వాలి: 
పంచాయతీ కార్యదర్శుల సంఘం 

ఆవాస్​ యోజన, నేషనల్ పంచాయతీ అవార్డులు, శానిటేషన్, అధిక ఒత్తిడి కారణంగా, మరికొందరు రెండు గ్రామాలకు ఇన్ చార్జి కార్యదర్శులుగా ఉండటంతో తప్పిదాలు చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శుల సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి తప్పులను మొదటివిగా భావించి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కార్యదర్శులకు సూచించామన్నారు. కొంతమంది కార్యదర్శుల తప్పిదాలతో యూనియన్ కు, కార్యదర్శులకు చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.